బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అమృత్ టెండర్లలో ఎటువంటి అవినీతి జరగలేదన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..’అమృత్ టెండర్లలో అవినీతి జరగలేదు. రూ. వేల కోట్ల కుంభకోణం జరిగిందంటూ కేటీఆర్ అనవసర ఆరోపణలు చేస్తున్నారు. కేటీఆర్ పై పరువు నష్టం దావా వేస్తాం.
బీఎల్ఆర్, మెగా, గజా కంపెనీలకు ఆనాటి ప్రభుత్వం రూ. 3,516 కోట్ల అంచనా టెండర్లు 3.99 శాతం ఎక్కువకు 2022-23లో ఒప్పందం చేసుకుంది. ఆ మూడు టెండర్లు ఎక్సెస్ ఉన్నాయని మేం గుర్తించాం. నిబంధనలకు తగినట్టుగా రీకాల్ చేయాలని సీఎం ఆదేశించారు’ అంటూ మంత్రి పొంగులేటి అన్నారు.
కేటీఆర్ కు నేను ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నా.. మేం పిలిచిన టెండర్ల విలువ రూ. 8,888 కోట్లు కాదు. ఒకవేళ రూ. 8,888 కోట్లయితే, నేను రాజీనామా చేస్తా. ఆ టెండర్లు రూ. 3516 కోట్లు మాత్రమే అయితే.. నువ్వు రాజీనామా చేస్తావా కేటీఆర్? మీ ఎమ్మెల్యేలంతా కాదు.. మీరు ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తారా? శోధ కంపెనీకి చెందిన సుజన్ రెడ్డి, నాపై పోటీ చేసిన ఉపేందర్ రెడ్డి అల్లుడు. బీఆర్ఎస్ హయాంలో సుజన్ రెడ్డికి పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో పనులిచ్చారు. ట్యాక్సులతో కలుపుకుని టెండర్ల విలువ రూ. 8,888 కోట్లున్నా నేను రాజీనామా చేస్తా. లేదంటే.. కేటీఆర్ రాజీనామా చేయాలి. ట్విట్టర్ లో షో చేస్తే కాదు కేటీఆర్.. విమర్శ చేయడానికి ముందు కనీస ఆధారాలు చూపండి. నా ఛాలెంజ్ ను స్వీకరిస్తే రేపు ఉదయం ఏ సమయానికి రావాలో వస్తా. మీరు చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపండి. మీరు చెప్పింది నిజమైతే కరెక్ట్ ఫార్మాట్ లో నేను రాజీనామా చేస్తా. మీరు చెప్పింది తప్పయితే.. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేయాలి.
ఒక్క రూపాయి కూడా అంచనాలు పెంచకుండా పాత రేట్లకే టెండర్ పిలిచాం. కొత్తగా టెండర్ దక్కించుకున్న ఓ కంపెనీ సుజన్ రెడ్డిదే.. కాకపోతే, ఆయన నా మీద పోటీ చేసిన ఉపేందర్ రెడ్డికి స్వయనా అల్లుడు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలమూరు – రంగారెడ్డిలో ప్యాకేజీ -7లో రూ. 2300 కోట్ల విలువైన టన్నెల్ వర్క్ లో రూ. 1100 కోట్లు విలువ చేసే వర్క్ ను ఆయన కంపెనీకి కట్టబెట్టారు. ప్రస్తుత మూడు టెండర్ల విలువ రూ. 3687 కోట్లు మాత్రమే. గత ప్రభుత్వం పిలిచిన టెంజర్ల కంటే తక్కువకే మా హయాంలో కన్ఫామ్ అయ్యాయి. విమర్శ చేయొచ్చు.. కానీ, అందులో పస ఉండాలి’ అంటూ కేటీఆర్ కు పొంగులేటి సవాల్ విసిరారు. చూడాలి మరి.. మంత్రి సవాల్ పై కేటీఆర్ స్పందిస్తారా లేదా అనేది.