బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యేపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మట్టా రాగమయి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. అందులో కేటీఆర్ పై మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డికి మహిళా లోకం తరుపున సూటి ప్రశ్న. మహిళలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా..? ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డ్యాన్స్ లు, రికార్డింగ్ డ్యాన్స్ చేసుకోమంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్ ను మీరు ఒప్పుకుంటారా..? ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలను కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు అవమానిస్తుంటే మీకు చీమకుట్టినట్టు కూడా లేదా..? ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కొనసాగించాలో లేదో సబితా ఇంద్రారెడ్డి , సునీతా లక్ష్మారెడ్డి తేల్చి చెప్పాలి.
కేటీఆర్ మహిళలను కించపరుస్తుంటే మీకు ఏ మాత్రం ఆత్మగౌరవం లేదా..? అహంకారంతో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించడానికి మీకు నోరు రావడం లేదా..? మహిళలకు కేటీఆర్ ఇప్పటివరకు క్షమాపణ చెప్పలేదు. విచారం వ్యక్తం చేస్తున్నానంటూ ముసలి కన్నీరు కారుస్తున్నారు. సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి.. మీకు నిజంగా ఆత్మగౌరవం ఉంటే నోటికొచ్చినట్లు వాగిన కేటీఆర్ చెంపలు వాయించి క్షమాపణ చెప్పించిండి. కేటీఆర్ కు తెలంగాణ వీరవనితల చరిత్ర తెలిసినట్లులేదు. నిజాం నవాబులకు వ్యతిరేకంగా తుఫాకి పట్టి పోరాడిన చరిత్ర తెలంగాణ మహిళలది.
తెలంగాణ మహిళా చైతన్యం ముందు కేటీఆర్ ఎంత…? కేటీఆర్ ఇప్పటికైనా మహిళా లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ ను చూసి కేటీఆర్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఎంతమంది మహిళలకు అవకాశం ఇచ్చారో అందరికి తెలుసు. పొట్టకూటి కోసం రికార్డింగ్ డ్యాన్స్ చేస్తున్నవారిని కేటీఆర్ అవమానిస్తున్నారు. చేతనైతే వారికి సాయం చేయాలి.
మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తున్నాం. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. ప్రభుత్వ స్కూల్స్ నిర్వహణను మహిళలకే ప్రభుత్వం అప్పగించింది. మహిళలకు ఇందిరా శక్తి క్యాంటీన్లు నిర్వహించుకునే అవకాశం కల్పించాం. లోక్ సభ ఎన్నికల్లో సున్నా స్థానాలు ఇచ్చిన కేటీఆర్ బుద్ధి మారలేదు’ అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.