లేదంటే పరువునష్టం దావా వేస్తా
– మంత్రి జూపల్లి కృష్ణారావు
(అమ్మన్యూస్, హైదరాబాద్):
కేటీఆర్, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తనకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని మంత్రి జూపల్లి కృష్ణారావు డిమాండ్ చేశారు. గాంధీ భవన్ లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ‘కేటీఆర్, ప్రవీణ్ కుమార్ ఏ చౌరస్తాకి రమ్మన్నా వస్తా. బేకూఫ్ మాటలు మాట్లాడే బేకూఫ్ గాళ్ళు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. శ్రీధర్ రెడ్డి హత్యను ఖండిస్తున్నాను. కేసులో పూర్తి వివరాలు తెలియాలని కేటీఆర్ అంటూనే హత్యకి కారణం జూపల్లి అంటున్నారు. శ్రీధర్ రెడ్డికి అనేకమందితో భూ తగాదాలు ఉన్నాయి. శ్రీధర్ రెడ్డికి ఎమ్మెల్యేలతో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి.
నేను, పొంగులేటి కేసీఆర్‌తో విభేదించి బయటకి వచ్చాక ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. కేసీఆర్‌ని నియంత అన్న ఆర్‌ఎస్ ప్రవీణ్ ఇప్పుడు కేసీఆర్ పంచన చేరారు. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆత్మగౌరవం అమ్ముకున్నారు. ఒకాయన ఐపీఎస్ ఆఫీసర్, ఒకాయన ఎన్‌ఆర్‌ఐ ఇద్దరూ కలిసి బట్టకాల్చి మీద వేస్తున్నారు. నన్ను, పొంగులేటిని కేసీఆర్ బర్తరఫ్ చేసినందుకు, ప్రజలు కేసీఆర్‌ని బర్తరఫ్ చేశారు. నాపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు కేటీఆర్, ఆర్‌ఎస్ ప్రవీణ్ క్షమాపణ చెప్పాలి. కేటీఆర్‌కి దమ్ము ఉంటే శ్రీధర్ రెడ్డి గ్రామానికి వెళ్లి నిజాలు తెలుసుకోవాలి. నిజనిర్ధారణ చేసి తప్పు నాదుంటే ఎలాంటి చర్యలైనా తీసుకోండి’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు ఘాటుగా స్పందించారు.