ఓవైపు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో.. స్పీకర్ కార్యాలయానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరగా.. ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్‌కు బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా.. ఆ కంప్లైంట్ తీసుకోవట్లేదంటూ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌పై చర్యలు తీసుకోవాలంటూ చేసిన ఫిర్యాదును స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీసుకోలేదంటూ బీజేపీ ఎల్పీ నేత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్పీకర్ తన ఫిర్యాదును స్వీకరించేలా ఆదేశించాలని కోర్టును కోరారు. మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం రోజున విచారణ చేపట్టిన న్యాయస్థానం.. మహేశ్వర్ రెడ్డి పిటిషన్‌ను తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది. అంతేకాకుండా.. ఫిర్యాదు తీసుకున్నట్టు పిటిషనర్‌కు ధ్రువీకరణ రశీదు కూడా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
అంతేకాకుండా.. ఎమ్మెల్యేలు దానం, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలపై దాఖలు చేసిన పిటిషన్‌లపైనా కూడా ధర్మాసనం విచారణ జరిపింది. స్పీకర్ నిర్ణయం తీసుకోక ముందే పిటిషనర్లు కోర్టుకు వచ్చారంటూ ఏజీ వాదించారు. 3 నెలలైనా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూ పిటిషనర్లు చేస్తున్న వాదన సరైంది కాదన్న ఏజీ.. వివాదం కోర్టులో ఉన్నందునే స్పీకర్ ఆ పిటిషన్లను పరిశీలించలేదని తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు.. తదుపరి విచారణను రేపటి (జులై 26)కి వాయిదా వేసింది.