కేరళ నుంచి గత పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన యూడీఎఫ్ కూటమి ఎంపీలు లోక్ సభలో నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై గళమెత్తుతున్నారని కాబట్టి రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోని ఇరవై 20 స్థానాల్లో వారిని గెలిపించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని అడ్డుకునేందుకు కేరళ నుంచి ఇరవై మందిని గెలిపించాల్సిందే అన్నారు.
కేరళలో నిర్వహించిన సమరాగ్ని సభలో రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మణిపూర్ ఘటన దేశానికి ఒక హెచ్చరిక లాంటిదన్నారు. మనం నిర్లక్ష్యం చేస్తే ఫలితం మన ఊహకే అందదని హెచ్చరించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా ఫ్రంట్ విజయం దేశ భవిష్యత్తుకు అవశ్యమని పేర్కొన్నారు.
నరేంద్ర మోదీ దుష్పరిపాలనను అంతమొందించేందుకు కేరళ నుంచి 20 మంది యూడీఎఫ్ ఎంపీలను లోక్ సభకు పంపించాలని కేరళీయులను కోరారు. బీజేపీకి వ్యతిరేకంగా ముఖాముఖి పోరాడుతోన్న ఇండియా ఫ్రంట్‌ను నిర్వీర్యం చేసేందుకు థర్డ్ ఫ్రంట్ పేరుతో అవినీతి నేతలు కేసీఆర్, పినరయి విజయన్ వంటి వారు తెరపైకి వస్తున్నారని, ఈ కుట్రను ప్రజలు గుర్తించాలన్నారు.
కేంద్రంలో బీజేపీ, కేరళలో సీపీఎం పాలనకు వ్యతిరేకంగా కేరళ పీసీసీ రాష్ట్రవ్యాప్త కార్యక్రమం చేపట్టింది. ఈ రోజు తిరువనంతపురంలో సమరాగ్ని పేరుతో ముగింపు సభను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ కేసీ వేణుగోపాల్, సచిన్ పైలట్, కేపీసీసీ ప్రెసిడెంట్ సుధాకరన్ తదితరులు పాల్గొన్నారు.