AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేసీఆర్ 80వేల పుస్తకాలు చదివారు.. అందుకే అసెంబ్లీకి రావాలి.. మంత్రి పొంగులేటి

అధికారం కోల్పోయిన నాటి నుంచి మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చింది రెండు సార్లే. ఒకసారి ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడానికైతే, రెండోసారి బడ్జెట్ సమయంలో పాల్గొన్నారు. ఇంత సీనియారిటీ ఉన్న లీడర్ అసెంబ్లీకి రావాలని, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం దీనిపై పలు సందర్భాల్లో ప్రస్తావించారు. అయినా కూడా కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడం లేదు. సోమవారం జరిగిన సమావేశానికి కూడా హాజరు కాలేదు. అయితే, 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు రెగ్యులర్‌గా జరుగబోతున్నాయి.

ఈసారైనా కేసీఆర్ వస్తారా లేదా? అనే చర్చ జరుగుతోంది. ఈ సమయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, తాను వస్తారనే అనుకుంటున్నానని అన్నారు. ఈ సమావేశాల్లో ఆర్వోఆర్ చట్టాన్ని తెస్తున్నామని, కేసీఆర్ సూచనలు చేయాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ‘‘80వేల పుస్తకాలు నేను, మా ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరూ చదవలేదు. వాటిని చదివిన అనుభవం ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నా. కేటీఆర్, హరీష్ రావు కనీసం 5వేల పుస్తకాలు చదివినా వాళ్ళ సూచనలు తీసుకునే వాళ్ళం. తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో సూచనలు చేశారా? గోల మాత్రం చేస్తున్నారు.

పదేండ్లలో అధికారంలో ఉన్నవాళ్ళు ఎప్పుడైనా అధికారిక ప్రకటన చేశారా’’ అని అడిగారు. రైతులకు బేడీలు వేసిన సంఘటనపై స్పందిస్తూ, ఇప్పటికే తమ ముఖ్యమంత్రి స్పందించారని చెప్పారు పొంగులేటి. గత ప్రభుత్వ తప్పిదాల వల్లే హాస్టల్స్‌లో ఫుడ్ పాయిజన్‌కి కారణమని అన్నారు.

అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహంపై సమాధానం లేకనే అసెంబ్లీకి రాకుండా పారి పోయారని విమర్శించారు. అదానీ విషయంలో వివాదం వద్దనే స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చిన రూ.100 కోట్లు వెనక్కి పంపామన్నారు. ఈనెల 31 లోపు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, 40శాతం డైట్ కాస్మొటిక్ చార్జీలు పెంచిన నేపథ్యంలో 14వ తేదీన మంత్రులు, అధికారులు సహఫంక్తి భోజనాలు చేస్తున్నట్టు చెప్పారు.

పదేండ్లలో బీఆర్ఎస్ బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ప్రజాపాలనలో అర్హులైన వారందరూ ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసుకోవచ్చని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో 10 కొత్త అంశాలు చేర్చామని, సర్వే అధికారుల రికమండేషన్ ఆప్షన్ తీసివేశామని తెలిపారు. ఇప్పటి వరకు 2 లక్షల 32 వేల దరఖాస్తులను యాప్‌లో నమోదు చేశామని, ఆలస్యం అయినా అసలైన లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10