అమ్మన్యూస్ ఆదిలాబాద్ : అదానీపై హిండెన్ బర్గ్ ఆరోపణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈడీ కార్యాలయాల వద్ద కాంగ్రెస్ ధర్నా కార్యక్రమాలు చేపట్టింది. హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకొని ఆందోళన చేశారు. ఈ ధర్నాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పాల్గొన్నారు. ధర్నాలో ఆదిలాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. ప్రధాని, అదానీ ఇద్దరూ ఒక్కటేనని విమర్శించారు. దేశంలో విలువైన సంపదను అదానీకి కట్టబెడుతున్నారని ఆయన విమర్శించారు.ఆర్థిక పరమైన లావాదేవీలలో అదానిపై వస్తున్న లక్షల కోట్ల ఆరోపణలపై ఖచ్చితంగా విచారణ జరగాలన్నారు. అదానీ నిష్పక్షపాతంగా విచారణకు సహకరించాలన్నారు.
మోదీ అదాని మధ్య ఒక చీకటి ఒప్పందం జరిగిందన్నారు. నరేంద్ర మోదీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అదానికి లక్షల కోట్లు దోచి పట్టారని ఆరోపణలున్నాయి. అదానీ అతని కంపెనీలపై జేపీసీ విచారణ జరిపించి కేంద్రం తమ చిత్త శుద్ధిని నిరూపించుకోవాలని కోరారు. అదానీ కంపెనీలో వాటాలున్నాయని ఆరోపణలెదుర్కుంటున్న సెబీ ఛైర్మన్ మాధబీ పురి బచ్ రాజీ నామా చేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు.
జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి నిజాలు నిగ్గుతేల్చాలని ఆయన కోరారు. లక్షలాది కోట్ల రూపాయలను బీజేపీ అప్పనంగా అదానికి కట్టబెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ తరపున ఖండిస్తున్నట్టు చెప్పారు. తమ అధినేత రాహుల్ గాంధీ అదానీ మోదీల చీకటి ఒప్పందం గురించి పార్లమెంట్ లో ఎన్నో సార్లు ప్రస్తావించారన్నారు. విచారణ జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందన్నారు.