నీటి లభ్యత నిర్ధారణ కాకుండానే కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మొదలయ్యాయని తేలింది. మూడు బ్యారేజీలలో నీటి లభ్యత అంశంలో నిర్మాణ సంస్థలే పరీక్షలు చేసుకున్నాయని, నీటి లభ్యత టెస్టుల నివేదికలు పూర్తికాకముందే బ్యారేజీల నిర్మాణం మొదలుపెట్టామని హైడ్రాలజీ ఇంజనీర్లు వెల్లడించారు. ఈ విషయాన్ని కమిషన్ చీఫ్ జస్టి చంద్రఘోష్‌కు ఇంజనీర్లు చెప్పారు. ఇక అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో లొకేషన్ల మార్పులు కూడా జరిగాయని ఇంజనీర్లు వెల్లడించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైన ఇంజనీర్లపై విచారణ కమిషన్ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజాలు చెప్పడానికి ఎందుకంత భయమని ప్రశ్నించింది. ‘‘నిజాలు దాచడానికి ప్రయత్నించినా, నిజాలను బైపాస్ చేసే ప్రయత్నం చేసినా.. కచ్చితంగా బయటకు తీస్తాం. నిజాలను దాచిపెట్టి బైపాస్ చేసే ప్రయత్నం చేస్తే స్వయంగా నేనే చర్యలు తీసుకుంటా’’ అని కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన, చూసిన, చేసిన పని గురించి చెప్పడానికి ఎందుకంత భయమని నిలదీశారు.
నిజాలు తప్పించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఎలా మర్చిపోతారు? అని జస్టిస్ చంద్రఘోష్ ప్రశ్నించారు. ఇంజనీర్లు అంకితభావంతో పనిచేస్తే బ్లాక్స్ ఎందుకు దెబ్బతిన్నాయి?, కొట్టుకుపోయాయి? అని ఇంజనీర్లను కమిషన్ ప్రశ్నించింది. రాష్ట్రస్థాయిలో జరిగిన విషయాలను కేంద్రంపై మళ్లించేందుకు ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. అఫిడవిట్లో చెప్పిన విషయాలు, చేర్చిన అంశాలు క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని పేర్కొన్నారు. కాగా సోమవారం నుంచి బహిరంగ విచారణ తిరిగి ప్రారంభం కానుంది.
ముగిసిన మూడో రోజు విచారణ
కాళేశ్వరం కమిషన్ మూడో రోజు విచారణ ముగిసింది. బుధవారం మొత్తం 15 మంది ఇంజనీర్లను కమిషన్ బహిరంగంగా విచారించింది. అన్నారం, సుందిళ్ల గ్యారేజ్‌కి సంబంధించిన ఇంజనీర్లు హాజరయ్యారు. హైడ్రాలజీ డిపార్ట్మెంట్కు చెందిన ఈఈ, ఇద్దరు సీఈలతో పాటు సుందిళ్ల, అన్నారం బ్యారేజీల ఈఈ, ఏఈఈ, ఎస్ఈ, డీఈలను కమిషన్ ప్రశ్నించింది. బుధవారంతో కలిపి ఇప్పటివరకు దాదాపు 90 మంది ఇంజనీర్లను కాళేశ్వరం కమిషన్ విచారించింది.