ఒకే దేశం-ఒకే ఎన్నిక (One Nation One Election Bill) లక్ష్యంతో దేశమంతా ఒకేసారి నిర్వహించేందుకు రూపొందించిన బిల్లు ఇవాళ లోక్‌సభ (Lok Sabha) ముందుకు వెళ్లింది. దీనికోసం ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా మరో బిల్లును కేంద్రం మంగళవారం సభలో ప్రశేపెట్టింది. ఈ బిల్లులను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ (Arjun Ram Meghwal) సభలో ప్రవేశపెట్టారు. విస్తృత సంప్రదింపులు జరిపేందుకు గానూ పార్లమెంటు ఉభయసభల ఉమ్మడి కమిటీకి ఈ బిల్లును సిఫారసు చేయాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను మేఘ్వాల్ కోరారు.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల అసెంబ్లీలకు, లోక్‌సభకు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడమే జమిలి ఎన్నికల ప్రధాన ఉద్దేశం. వాస్తవానికి మన దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ కొత్తదేమీ కాదు. 1952లో తొలి సాధారణ ఎన్నికలు మొదలుకొని, 1967 వరకు లోక్‌సభకు, రాష్ర్టాల అసెంబ్లీలకు చాలావరకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అయితే అనంతర కాలంలో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవడం, గడువుకు ముందే పలు రాష్ర్టాల శాసనసభలను బర్తరఫ్ చేయడం తదితర కారణాలతో జమిలి ఎన్నికలు పట్టాలు తప్పాయి. దీంతో లోక్‌సభ, అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు జరపడం మొదలైంది.
అసలు జమిలి ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారన్న చర్చ పెద్దయెత్తున జరుగుతున్నది. జమిలి ఎన్నికలకు అపాయింటెడ్ తేదీగా లోక్‌సభ తొలిసారి సమావేశమైన రోజును గుర్తించాలని కోవింద్ కమిటీ సిఫారసు చేసింది. ఈ లెక్కన ఈ లోక్‌సభ తొలి సమావేశం గత జూన్ 24న జరిగింది. అంటే లోక్‌సభ కాలపరిమితి తీరిపోయే నాటికి అంటే జూన్ 24, 2029లోపు జమిలి ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది. దీన్ని విశ్లేషిస్తే, 2029లోనే జమిలి ఎన్నికలు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఎన్డీయే కూటమిలో మిత్రపక్షంగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు కూడా జమిలి ఎన్నికలు 2029లోనే అంటూ పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. అలాగే, తన పూర్తి పదవీకాలాన్ని వదులుకోవడానికి ప్రధాని మోదీ సిద్ధంగా లేరని, ఈ క్రమంలో 2029లోనే జమిలి ఎన్నికలు ఉండొచ్చని మరికొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, 2027లో, 2028లో కూడా జమిలి ఎన్నికల నిర్వహణను కొట్టిపారేయలేమని, బిల్లు చట్టంగా మారాక, ఇది అంత కష్టతరమైన పనేమీకాదని మరికొందరు వాదిస్తున్నారు. ఇదిలాఉండగా.. సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత సమావేశమయ్యే తొలి లోక్‌సభ సమావేశంలో జమిలి బిల్లును రాష్ట్రపతి నోటిఫై చేయాలని, ఆ రోజును అపాయింటెడ్ డేగా తీసుకొంటే.. ఆ తర్వాత ఐదేండ్లకు జమిలి ఎన్నికలు నిర్వహిస్తారన్న వాదనను కూడా కొందరు తెరమీదకు తీసుకొస్తున్నారు. ఇదేజరిగితే, జమిలి ఎన్నికలు 2034లోనే జరుగొచ్చని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు.