AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఓయూ ఈఎంఆర్‌సీకి అంతర్జాతీయ గుర్తింపు

ఉస్మానియా యూనివర్సిటీ : ప్రతిష్టాత్మక యూజీసీ – సీఈసీ 16వ అంతర్జాతీయ షార్ట్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఎడ్యుకేషన్‌ అండ్‌ మల్టీమీడియా రీసర్చ్‌ సెంటర్‌ (ఈఎంఆర్‌సీ) అవార్డు గెలుచుకుంది. దీంతో ఈఎంఆర్‌సీకి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. జోధ్‌పూర్‌లో జరిగిన ఈ ఫెస్టివల్‌లో అవార్డు పొందిన ఈఎంఆర్‌సీ డైరెక్టర్‌ రఘుపతిరెడ్డిని ఓయూ వీసీ ప్రొఫెసర్‌ కుమార్‌ అభినందించారు.

సమాజానికి దూరంగా అడవుల్లో బ్రతుకుతున్న గుత్తికోయ చిన్నారుల బతుకు చిత్రంపై తీసిన ‘రీచింగ్‌ ది అన్‌ రీచ్డ్‌’ షార్ట్‌ ఫిల్మ్‌కు అభివృద్ధి విభాగంలో ట్రోఫీ, నగదు బహుమతి, ధృవపత్రం లభించడం, మానవహక్కుల విభాగంలో స్క్రీనింగ్‌కు ఎంపికవడం ఓయూకు గర్వకారణమని వీసీ అభిప్రాయపడ్డారు. సామాజిక, అభివృద్ధి, విద్యా, ఆధునిక సాంకేతికత, పరిశోధనలు ఇతివృత్తంగా మరిన్ని లఘుచిత్రాలు రూపొందించాలని సూచించారు. అవార్డుతో పాటు వచ్చిన నగదు బహుమతి రూ.50 వేలను వీసీ చేతుల మీదుగా గుత్తి కోయ చిన్నారుల విద్యాభ్యాసం కోసం శ్రమిస్తున్న సంతోష్‌ ఇస్రం మిత్ర బృందానికి విరాళంగా అందజేశారు.

రఘుపతిరెడ్డి మాట్లాడుతూ.. అవార్డు తనపై బాధ్యతను మరింత పెంచిందని అన్నారు. మారుమూల గిరిజన విద్యార్థులను బాహ్య ప్రపంచానికి పరిచయం చేసే ఉద్దేశంతో తామంతా పనిచేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ నరేశ్‌రెడ్డి, ఓఎస్డీ ప్రొఫెసర్‌ జితేందర్‌నాయక్‌, యూజీసీ డీన్‌ ప్రొఫెసర్‌ లావణ్య, ప్రొఫెసర్‌ ప్యాట్రిక్‌, ప్రొఫెసర్‌ స్టీవెన్‌సన్‌, ప్రొఫెసర్‌ నరేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10