ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పోలీసు అధికారులపై నిప్పులు చెరిగే క్రమంలో, హోంమంత్రి అనితపైనా అసంతృప్తి ప్రదర్శించారు. హోంమంత్రిగా అనిత సరిగా వ్యవహరించడంలేదన్న అభిప్రాయం పవన్ మాటల్లో వ్యక్తమైంది. నేను గనుక హోంశాఖను తీసుకుంటేనా అంటూ వ్యాఖ్యానించారు. అయితే, పవన్ వ్యాఖ్యలపై అనిత ఎంతో సంయమనంతో స్పందించారు.
తాజాగా, పవన్, అనిత రాష్ట్ర సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ మర్యాదపూర్వక భేటీలో ఇరువురు నవ్వుతూ, ఉల్లాసంగా కనిపించారు. దీనిపై అనిత సోషల్ మీడియా ద్వారా స్పందించారు.
ఇటీవల కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాల గురించి, హోంశాఖ తీసుకుంటున్న చర్యల గురించి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లినట్టు వెల్లడించారు. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించాలని… ఆడబిడ్డలకు అన్యాయం చేసిన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించేలా గట్టి చర్యలు తీసుకోవాలని పవన్ సూచించినట్టు అనిత తెలిపారు. ప్రజా సంక్షేమం, శ్రేయస్సు కోసం ప్రతి క్షణం శ్రమించే ప్రజా ప్రభుత్వం తమ కూటమి ప్రభుత్వం అని అనిత అభివర్ణించారు.
ఈ సందర్భంగా పవన్ తో భేటీకి సంబంధించిన ఫొటోలను కూడా అనిత పంచుకున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ ఫొటోలే కనిపిస్తున్నాయి.