తెలంగాణలోని మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ తీపికబురు చెప్పింది. ఇప్పటికే.. ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న ప్రభుత్వం.. త్వరలోనే ప్రతి మహిళకు నెలకు 2 వేల రూపాయలు, సబ్సీడీ గ్యాస్ సిలిండర్ లాంటి పథకాలు అందించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే.. మరో శుభవార్తను మోసుకొచ్చింది. డ్వాక్రా సంఘాల మహిళలకు త్వరలోనే వడ్డీలేని రుణాలను మళ్లీ ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. చాలా కాలం నుంచి జీతాలు రావటం లేదని ఆశా వర్కర్లు తమ ఇబ్బందులను తన దృష్టికి తీసుకొచ్చారని భట్టి విక్రమార్క తెలిపారు. వారికి జీతాలు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు.. గిరిజనుల అభివృద్ధి కోసం కూడా ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తున్నట్లు భట్టి చెప్పుకొచ్చారు.
గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో.. రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందజేస్తామని హామీ ఇచ్చి విస్మరించిందని భట్టి విక్రమార్క విమర్శించారు. అంగన్వాడీ, ఆశా వర్కర్లు, స్వయం సహాయక బృందాలు, మధ్యాహ్న భోజన కార్మికులు, రెండో ఏఎన్‌ఎంల వంటి వారికి ప్రతి నెల 1వ తేదీనే జీతాలు, బిల్లులు చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు భట్టి పేర్కొన్నారు.