దేశ వ్యాప్తంగా విద్యారంగానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. మంగళవారం ప్రధాని చేతుల మీదుగా మూడు ఐఐటీలకు కొత్త క్యాంపస్‌లు ప్రారంభించారు. రూ. 13, 373 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. విశాఖలో ఐఐఎం, తిరుపతిలో ఐఐటీ, కర్నూల్ ఐఐటీ, హైదరాబాద్ ఐఐటీని జమ్మూ కాశ్మీర్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. అలాగే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్‌లో అన్ని రకాలుగా అభివృద్ధి చేసి తీరుతామని, మోడీ గ్యారంటీ అంటే ఇలానే ఉంటుందని అన్నారు. జమ్మూ కాశ్మీర్ నుంచి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం సంతోషకరమని, గతంలో ఎవరు కూడా పట్టించుకోలేదని విమర్శించారు. జమ్మూలో ఐఐటీ కూడా ఉందని, మోడీ గ్యారంటీ అంటేనే హామీ అని చెప్పారు. 70 ఏళ్ల కలను రానున్న రోజుల్లో నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.
గతంలో జమ్మూ కాశ్మీర్‌లో బాంబులు, కిడ్నాప్‌లు, విభజన వంటి నిరాశజనక వంటి వార్తలు మాత్రమే వచ్చేవన్నారు. కానీ, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అభివృద్దిలో ముందుకు సాగుతుందని మోడీ తెలిపారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ అబద్దాలు చెబుతుందని విమర్శించారు. దశాబ్దాల తరబడి వంశపారంపర్య రాజకీయాల భారాన్ని జమ్మూ కాశ్మీర్ భరించాల్సి వచ్చిందన్నారు. తమ కుటుంబాల గురించి మాత్రమే ఆ పార్టీలు ఆందోళన చెందుతున్నాయన్నారు. జమ్మూ కాశ్మీర్‌కు విముక్తికి లభిస్తున్నందుకు తాను సంతోషిస్తున్నాని అన్నారు. గత 10 ఏళ్లలో భారతదేశంలో పలు విద్యా సంస్థలను ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఒక్క జమ్మూ కాశ్మీర్ లోనే 50 కొత్త డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసినట్టుగా మోడీ ప్రస్తావించారు. 2013 డిసెంబర్‌లో ఇక్కడ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న సమయంలో జమ్మూలో ఐఐటీ, ఐఐఎం వంటి విద్యా సంస్థలను ఏర్పాటు చేయలేకపోతున్నారని చెప్పారు. ఆర్టికల్ 370ను రద్దు చేసిన విషయాన్ని మోడీ గుర్తు చేశారు. జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు సమగ్ర అభివృద్ది దిశగా పయనిస్తుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు మన సైనికులను ఏనాడూ గౌరవించలేదని మండిపడ్డారు. ఒకే ర్యాంక్, ఒకే పెన్షన్ అంటూ 40 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం మన సైనికులకు అబద్ధాలు చెబుతూ వచ్చిందని అన్నారు. ఓఆర్‌పీని తెచ్చింది బీజేపీయేనని ప్రధాని మోడీ అన్నారు.