లోక్సభలో రాజ్యాంగంపై జరిగిన చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ చివర్లో సమాధానం ఇచ్చారు. రాజ్యాంగాన్ని ఆమోదించి 75ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇది భారతదేశానికి గర్వకారణమని ప్రధాని మోదీ తెలిపారు. రాజ్యాంగ వారసత్వంపై చర్చకు సహకరించిన ఎంపీలు, స్పీకర్లకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. దేశ ప్రగతికి భారత రాజ్యాంగం కారణమన్నారు. ఇంతకాలం ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టినందుకు కోట్లాది మంది భారతీయులకు మోడీ ధన్యవాదాలు తెలిపారు.
రాజ్యాంగ నిర్మాతలు ప్రజాస్వామ్యాన్ని 1950లో పుట్టిన భావనగా చూడలేదని మోడీ తెలిపారు. వేల సంవత్సరాల పాటు భారత దేశ గొప్ప వారసత్వం నుండి వారు ప్రేరణ పొందారని తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి ప్రజాస్వామ్యం అప్పటివరకూ తెలియదన్నారని, కానీ భారతదేశానికి ప్రజాస్వామ్య సంప్రదాయాలు చాలా కాలంగా తెలుసని మోదీ వ్యాఖ్యానించారు. రాజ్యాంగ చట్రం భారతదేశానికి పరాయిది కాదన్న తొలి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యల్ని గుర్తుచేశారు.
రాజ్యాంగ అసెంబ్లీలో 15 మంది చురుకైన మహిళా సభ్యులు ఉన్నారని, వారు రాజ్యాంగాన్ని రూపొందించడంలో గణనీయంగా సహకరించారని ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు. భారతదేశం తన ప్రజాస్వామ్య ప్రయాణం ప్రారంభంలోనే మహిళలకు ఓటు హక్కును కల్పించడం గర్వించదగ్గ విషయం అన్నారు. లింగ సమానత్వానికి దేశం యొక్క నిబద్ధతను గుర్తుచేసిన ప్రధాని మోదీ.. భారతదేశం మహిళల నేతృత్వంలోని అభివృద్ధి నమూనాను అనుసరిస్తోందన్నారు. రాష్ట్రపతి ముర్ము ఎన్నికను దీనికి ఉదాహరణగా చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తయ్యే నాటికి దేశం అభివృద్ధి చెందిన దేశ హోదాను సాధిస్తుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇందులో భాగస్వాములయ్యేలా దేశ ప్రజలకు తగిన స్ఫూర్తి అందించామన్నారు. భారతదేశ వ్యవస్థాపక నాయకుల వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తూ, వివిధ భౌగోళిక ప్రాంతాల నుండి రాజ్యాంగ సభ సభ్యులు వచ్చారని, భిన్నత్వంలో దేశం యొక్క ఏకత్వానికి ప్రతీకగా దీన్ని మోడీ పేర్కొన్నారు. భారత దేశ ఐక్యతకు అడ్డంకిగా ఉన్న ఆర్టికల్ 370ని రద్దు చేశామన్నారు. ప్రస్తుతం జమిలి ఎన్నికలను కూడా దేశ ఐక్యతా ప్రయత్నాల్లో భాగంగానే చూస్తున్నామన్నారు.