దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత జట్టు అదరగొట్టింది. సెంచూరియన్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ప్రత్యర్థి జట్టును 11 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత తిలక్ వర్మ సెంచరీతో భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం ఆతిథ్య జట్టును 208/7కే పరిమితం చేసింది. దీంతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో మూడు ముగిసే సరికి 2-1తో ఆధిక్యంలో నిలిచింది. శతకంతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన తిలక్ వర్మ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే సంజూ శాంసన్ వికెట్ కోల్పోయినా.. అభిషేక్ శర్మ, తిలక్ వర్మలు జట్టును ఆదుకున్నారు. ఎడాపెడా సిక్స్‌లు ఫోర్లు కొట్టడంతో 8 ఓవర్లు ముగిసే సరికి భారత్ 99/1తో తిరుగులేని స్థితిలో నిలిచింది. ఈ క్రమంలోనే తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ 51 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. భారత్ తరఫున 23వ మ్యాచ్ ఆడుతోన్న ఈ ప్లేయర్.. తొలిసారి మూడంకెల మార్కును అందుకున్నాడు. అతడికి అభిషేక్ శర్మ (25 బంతుల్లో 50 రన్స్) కూడా సహకరించాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 219/6 పరుగులు చేసింది. 0.2 ఓవర్ల సమయంలో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ.. మొత్తంగా 56 బంతులు ఎదుర్కొని.. 107 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అరంగేట్ర ఆటగాడు రమణ్‌దీప్ 6 బంతుల్లో 15 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు.