వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ మీద దాడి ఘటనలో కీలక వ్యక్తి సురేశ్ అని గుర్తించామని, అతని కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారని ఐజీ సత్యనారాయణ వెల్లడించారు. కలెక్టర్ మీద దాడి ఘటన గురించి ఆయన మాట్లాడుతూ… ఈ ఘటనలో 16 మందిని అరెస్ట్ చేశామని, మరో 57 మంది అదుపులో ఉన్నారని తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన విచారణ మేరకు మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నారు.
ఈ ఘటనపై మూడు కేసులు నమోదు చేశామన్నారు. దర్యాఫ్తు కొనసాగుతున్నట్లు తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణలో గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నడూ జరగలేదన్నారు. కలెక్టర్ లగచర్లకు రాగానే ఒక్కసారిగా నినాదాలు చేస్తూ దాడికి ప్రయత్నించారని తెలిపారు.
ఇలాంటి ఘటనలు జరుగుతాయని ముందుగానే గుర్తించిన కలెక్టర్ గ్రామ శివారులో సభను ఏర్పాటు చేశారన్నారు. ఈ ఘటనలో బయటి వ్యక్తుల ప్రమేయాన్ని గుర్తించామన్నారు. సురేశ్‌ను అరెస్ట్ చేశాక అతని వెనుక ఎవరున్నారో తేలుతుందన్నారు. అతని కాల్ డేటాను విశ్లేషిస్తున్నట్లు చెప్పారు.