వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి ఘటనలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఎ1 నిందితుడు పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనను నేడు న్యాయవాదులు కలిశారు. వారి ద్వారా నరేందర్ రెడ్డి కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.
నిన్న ఉదయం తాను కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, బలవంతంగా కారులోకి ఎక్కించి వికారాబాద్ డీటీసీకి తీసుకువెళ్లినట్లు చెప్పారు. ఆ సమయంలో పోలీసులు తన స్టేట్‌మెంట్ తీసుకోలేదని తెలిపారు. తనను కోర్టులో హాజరుపరిచే పది నిమిషాల ముందు కొన్ని పేపర్లపై తన సంతకాలు తీసుకున్నారని వెల్లడించారు. ఈ కేసులో తనను అక్రమంగా ఇరికించారని వాపోయారు.
అరెస్ట్‌కు ముందు తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, కేటీఆర్ సహా ఇతర ముఖ్య నేతల ఆదేశాలతో దాడులు చేయించినట్లు పోలీసులు కట్టుకథ అల్లారని పేర్కొన్నారు. తాను పోలీసులకు ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదని, రిమాండ్ రిపోర్టులో పోలీసులు చెప్పినవన్నీ నిజం కాదన్నారు. తన స్టేట్‌మెంట్‌ను పరిగణనలోకి తీసుకొని విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు.