- సాగర్‌లో మట్టి, ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను నిమజ్జనం చేయవచ్చన్న హైకోర్టు
- పీవోపీ విగ్రహాలను మాత్రం తాత్కాలిక నీటి కుంటల్లో నిమజ్జనం చేయాలని ఆదేశాలు
- నిమజ్జనం విషయంలో 2021లో రూపొందించిన మార్గదర్శకాలనే పాటించాలని సూచన
హుస్సేన్ సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనం హైకోర్టు మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. 2021లో రూపొందించిన మార్గదర్శకాలనే పాటించాలని స్పష్టం చేసింది. మట్టి, ఏకో ఫ్రెండ్లీ విగ్రహాలను మాత్రమే నిమజ్జనం చేయాలని క్లారిటీ ఇచ్చింది. పీవోపీ విగ్రహాలను కృత్రిమ నీటికుంటలోనే నిమజ్జనం చేయాలని చెప్పింది. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృత్రిమ కొలనుల్లో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయాలని ఆదేశించింది.
గత రెండేళ్లల్లో హైకోర్టు ఆదేశాలను ధిక్కరించారని పిటిషనర్ వేణుమాధవ్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నిమజ్జనం ట్యాంక్‌బండ్‌పై భారీ క్రేన్లు నిలుపుతున్నారంటూ పిటిషనర్ అభ్యంతరం తెలిపారు. ఆయా భారీ క్రేన్లతో ట్యాంక్‌బండ్‌కు ముప్పు ఉందని పిటిషనర్ వేణుమాధవ్ పేర్కొన్నారు. అయితే, కోర్టు ధిక్కరణ పిటిషన్ ఇంత ఆలస్యంగా ఎందుకు వేశారని పిటిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. 2021 నాటి మార్గదర్శకాలను పాటించాలని హైకోర్టు మరోసారి ఆదేశాలు జారీ చేసింది. పీవోపీ విగ్రహాలను సహజ జలవనరుల్లో నిమజ్జనం చేయొద్దని హైకోర్టు ఆదేశాలిచ్చింది.