నిత్యం రద్దీతో కితకితలాడే హైదరాబాద్ రహదారులపై మద్యం బాబులు దర్జాగా తిరిగేస్తున్నారు. రోడ్లపై ఏ కాస్త ఏమరపాటుగా ఉన్నా ఎటు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితుల్లోనూ మందు తాగేసి ఎంచక్కా బండ్లు నడిపేస్తున్నారు. పోలీసులు వారిస్తున్న, ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తూ.. మందుబాబులను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నా తమ దారిని మాత్రం మార్చుకోవటం లేదు. గత మూడు నెలలుగా నగరంలో నమోదైన కేసులే ఇందుకు ఉదాహరణ..
హైదరాబాద్ లో ఆగస్టు 24 నుంచి నవంబర్ 21 వరకు మూడు నెలల్లో నగరంలో పట్టుబడిన వారి సంఖ్య ఏకంగా 14 వేల మంది కావడం గమనార్హం. నగరంలోని వివిధ ప్రాంతాల్లో రద్దీ సమయాల్లో విస్తృతంగా మద్యం తనిఖీలు చేపడుతున్న పోలీసులు 13,188 మందిపై కేసులు నమోదు చేసి.. కోర్టులకు పంపించారు. వీరిపై ఛార్జిషీట్లు సైతం దాఖలు చేశారు. ఈ విషయాన్ని హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్ వెల్లడించారు.
మద్యం కేసుల్లో గత మూడు నెలల్లోనే మొత్తం 824 మందిపై కేసులు నమోదు చేసి కోర్టులకు హాజరుపరచగా.. ఒకటి నుంచి పది రోజుల పాటు సామాజిక సేవ చేయాల్సిందిగా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మరో 25 మందికి రెండు రోజులు పాటు సామాజిక సేవ చేయాల్సిందిగా ఆదేశించింది.అతిగా మద్యం సేవించిన కేసుల్లో 89 మంది లైసెన్సుల్ని రెండు నుంచి ఆరు నెలలు సస్పెండ్ చేయాల్సిందిగా ఆర్డీవోకు కోర్టులు ఆదేశాలు జారీ చేశాయి.