కూతురు రేపు కాంగ్రెస్‌లో చేరుతారు
నా కొడుకు విప్లవ్ నిర్ణయం మంచిదే..
కే.కేశవరావు సంచలన వ్యాఖ్యలు
బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసినట్లు వెల్లడి
(అమ్మన్యూస్, ప్రతినిధి):
రాజ్యసభ ఎంపీ, సీనియర్ నేత కె. కేశవరావు బీఆర్‌ఎస్‌ను వీడారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రెస్‌మీట్ నిర్వహించి అధికారికంగా ప్రకటించారు. బాధతోనే బీఆర్‌ఎస్ వీడుతున్నానని, తిరిగి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు చెప్పారు. పార్టీ మార్పుపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించినట్లు వెల్లడిరచారు. ఈ సందర్భంగా ఎంపీ కే.కేశవరావు ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాంగ్రెస్‌లో చేరుతున్న నేపథ్యంలో రాజ్యసభకు అవసరమైతే రాజీనామా చేస్తానని, కాంగ్రెస్ మళ్లీ రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇస్తే స్వీకరిస్తానని తెలిపారు. కేసీఆర్‌ను కలిసినప్పుడు కొన్ని రోజులు ఆగితే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారని చెప్పారు. తన కొడుకు విప్లవ్ మంచి నిర్ణయమే తీసుకున్నారని తెలిపారు. తన కూతురు విజయలక్ష్మి మాత్రం రేపు కాంగ్రెస్‌లో చేరుతారని చెప్పారు. తాను 55 సంవత్సరాలు కాంగ్రెస్‌లో ఉన్నానని తెలిపారు. ఎవ్వరికీ ఇవ్వని పదవులను కాంగ్రెస్ పార్టీ తనకు ఇచ్చిందని అన్నారు.
తాను ఎమ్మెల్సీ, ఎంపీ, మంత్రి, పీసీసీ, సీడబ్ల్యూసీ మెంబర్‌గా కాంగ్రెస్ అనేక అవకాశాలు ఇచ్చిందని చెప్పారు. తాను ఇందిరాగాంధీ హయాంలో మంత్రిని అయ్యానని తెలిపారు. పార్లమెంట్లో బిల్లు పాస్ కావడం వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పారు. అందుకు కాంగ్రెస్ కారణమని తెలిపారు. తెలంగాణ కోసమే తాను టీఆర్‌ఎస్‌లోకి వెళ్లానని చెప్పారు.