రాజకీయ కక్షతోనే నోటీసులు
విచారణ తర్వాత చిరుమర్తి లింగయ్య సంచలన వ్యాఖ్యలు!
ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్పష్టం చేశారు. ఈ కేసులో గురువారం పోలీసు విచారణకు ఆయన హాజరయ్యారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసులో ఇద్దరి వ్యక్తులు నంబర్లు కావాలని తనను అడిగారన్నారు. ప్రచార సమయంలో తిరుపతన్నతో తాను మాట్లాడిన మాట వాస్తవం అని స్పష్టం చేశారు. మళ్లీ విచారణకు ఎప్పుడు పిలిచినా వస్తానన్నారు. పోలీసులు తనతో పాటు ఇంకా ఎవరికీ నోటీసులు ఇవ్వలేదన్నారు.
రాజకీయ కుట్రలో భాగంగానే తనకు నోటీసులు ఇచ్చినట్లుగా భావిస్తున్నానని ఆయన అన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నందునే తనకు నోటీసులు వచ్చాయన్నారు. ఈ నోటీసులపై న్యాయపోరాటం కూడా చేస్తానన్నారు. తాను జిల్లాలో పని చేసిన పోలీసు అధికారులతో మాట్లాడి ఉండవచ్చునని… అలాగే పోలీసు అధికారుల పోస్టింగుల కోసం, కార్యకర్తల అవసరాల కోసం మాట్లాడటం సహజమేనన్నారు.