హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ రాజీనామా వార్తలపై స్పందించారు. ‘నేను రాజీనామా చేయలేదు. నేను ఫైటర్.. పోరాడుతూనే ఉంటా. మా ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదు. ఐదేళ్లు అధికారంలో ఉంటుంది. పార్టీలో ఎలాంటి సంక్షోభం లేదు. మా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారు. హిమాచల్ ముఖ్యమంత్రిని మార్చుతారంటూ ప్రచారం జరుగుతుందని’ సుఖ్వీందర్ రాజీనామా వార్తలను ఖండించారు. రాజ్యసభ ఎన్నికల తర్వాత హిమాచల్ ప్రదేశ్లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌తో హిమాచల్‌ప్రదేశ్ రాజకీయ నాటకానికి తెరలేపింది.
రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి సమానంగా ఓట్లు వచ్చిన నేపథ్యంలో హస్తం పార్టీపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కాషాయదళం సిద్ధమైంది. మరోవైపు రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్ రాజీనామా చేయడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని, ప్రభుత్వంలో తాను అవమానకర పరిస్థితులను ఎదుర్కొన్కానని మంత్రి ఆరోపించారు. ఈ క్రమంలోనే రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిమ్లా నుంచి హర్యానాకు వెళ్లారు. వారంతా బీజేపీతో టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం మంత్రి పదవికి విక్రమాదిత్య రాజీనామా చేశారని, తాజాగా సీఎం పదవికి సుఖ్వీందర్ సింగ్ రాజీనామా చేసినట్లు బయటపడింది.
రంగంలోకి హైకమాండ్ నేతలు
అటు, సీఎంపై అవిశ్వాసం తీర్మానం పెట్టేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు బుధవారం గవర్నర్‌ను కలిశారు. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన రెబల్ ఎమ్మెల్యేలు ఈ ఉదయం నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సీఎం రాజీనామా చేయాలని అంతకుముందు వారు డిమాండ్ చేశారు. ‘‘దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి. సీఎంను మారిస్తే భవిష్యత్తు కార్యాచరణపై పార్టీతో చర్చలు జరుపుతాం. లేదంటే మా దారులు మాకున్నాయి’’ అని ఓ రెబల్ ఎమ్మెల్యే వెల్లడించారు. దీంతో పార్టీలో విభేదాలను పరిష్కరించేందుకు హైకమాండ్ హుటాహుటిన చర్యలు చేపట్టింది. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, హరియాణా మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడాను రాష్ట్రానికి పరిశీలకులుగా రప్పించింది. తాజా పరిస్థితులపై కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే మాట్లాడినట్లు సమాచారం.