అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ ఈ నెల 4న వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. నటిగా తనదైన ముద్ర వేసుకున్న శోభిత ధూళిపాళ ఈ ఏడాది మంకీ మ్యాన్ సినిమాతో హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన శోభిత తన వ్యక్తిగత అభిరుచుల గురించి, భర్త నాగచైతన్య గురించి పలు విశేషాలను మీడియాతో పంచుకుంది. ఎంతోకాలంగా ఎదురుచూసిన ప్రేమ చైతూ రూపంలో తనకు దక్కిందని చెప్పుకొచ్చింది. చైతూ లాంటి వ్యక్తి భర్తగా రావడం తన అదృష్టమని పేర్కొంది. సింప్లిసిటీ, మంచి మనసు, దయ, ఇతరులపట్ల మర్యాదగా ఉంటూ, హుందాగా ప్రవర్తించే చైతూ లక్షణాలు తనను ఆకట్టుకున్నాయని తెలిపింది. తనను ఎంతగానో ప్రేమిస్తాడని, కేరింగ్ పర్సన్ అని భర్త నాగ చైతన్యపై పొగడ్తల వర్షం కురిపించింది.
ఆలయ సందర్శనలో ప్రశాంతత లభిస్తుంది..
చిన్ననాటి నుంచి తనకు భక్తి ఎక్కువేనని శోభిత చెప్పింది. ఆలయంలో కాసేపు గడిపితే ప్రశాంతంగా అనిపిస్తుందని, అందుకే మనసు బాగాలేకుంటే ఎవరో ఒకరిని తోడుగా తీసుకుని ఆలయానికి వెళుతుంటానని వివరించింది. కూచిపూడి, భరతనాట్యంలో తనకు ప్రావీణ్యం ఉందని, సమయం దొరికినప్పుడల్లా డ్యాన్స్ చేస్తుంటానని తెలిపింది. పుస్తకపఠనం చాలా ఇష్టమని, కవిత్వం కూడా రాస్తానని చెప్పింది. వంటలోనూ తనకు ప్రావీణ్యం ఉందని, సమయం దొరికితే వంటింట్లోకి దూరిపోతానని చెప్పింది. తను వంట చేస్తే ఎవరైనా సరే లొట్టలేసుకుంటూ తినాల్సిందేనని చెప్పుకొచ్చింది. ఆవకాయ, పులిహోర, ముద్దపప్పు, పచ్చిపులుసు అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పింది. ఎక్కడికెళ్లినా ఇంటి భోజనమే పట్టుకెళ్తానని శోభిత వివరించింది.
కెరీర్ తొలినాళ్లలో తిరస్కరణలు..
కెరీర్ తొలినాళ్లలో తనకు ఎన్నో తిరస్కరణలు ఎదురయ్యాయని శోభిత వెల్లడించింది. అందంగా లేనని, ఆకర్షణీయంగా కనిపించనని తన ముఖం మీదే చెప్పేవారని పేర్కొంది. ఓ ప్రముఖ కంపెనీ వాణిజ్య ప్రకటనల కోసం ఆడిషన్స్ కు వెళితే బ్యాక్ గ్రౌండ్ మోడల్ గా కూడా పనికిరానని చెప్పడం తనను ఎంతో బాధించిందని వివరించింది. అయితే, పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించి కొన్నాళ్ల తర్వాత అదే కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ ను అయ్యానని తెలిపింది.
నాకు నచ్చితేనే సినిమాకు సైన్ చేస్తా..
వచ్చిన ప్రతి పాత్రనూ తాను చేయనని, పాత్ర తనకు నచ్చితేనే సినిమాకు సైన్ చేస్తానని శోభిత తెలిపింది. ఎప్పుడూ తెరపై కనిపించాలనే కోరిక తనకు లేదని తన అభిరుచులకు తగిన పాత్ర అయితేనే చేస్తానని పేర్కొంది. విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాలనేది తన కోరిక అని వెల్లడించింది.