పటాన్‌చెరు పరిధిలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. కోటి విలువైన కిలో ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పటాన్‌చెరు, యాంటీ నార్కోటిక్స్ పోలీసులు తెలిపారు. డ్రగ్స్‌ను కలిగి ఉన్న ఇద్దరు నిందితులను పటాన్‌చెరు పోలీసులు అరెస్టు చేశారు. నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో దాడులు చేసి పోలీసులు డ్రగ్స్‌ను సీజ్ చేశారు.
డ్రగ్ సఫ్లయర్స్ తమ వ్యాపారాన్ని హైదరాబాద్‌లో నిర్వహించేందుకు కొత్త దారులు ఎంచుకుంటున్నారు. నూతన సంవత్సర వేడుకులు దగ్గర పడుతుండటంతో ముంబై, గోవా, బెంగళూర్ నుంచి డ్రగ్స్ హైదరాబాద్‌కు సరఫరా చేసేందుకు డ్రగ్స్ స్మగ్లర్లు వివిధ రకాలుగా ప్రయత్నిస్తుండగా, వాటిని కస్టమర్లకు విక్రయించి లాభాలు పొందేందుకు డ్రగ్స్ పెడ్లర్స్ యత్నిస్తున్నారు. తాజాగా ఎల్‌జీబీటీక్యూ (లెస్‌బియాన్స్, గే, బైసెక్స్‌వల్, ట్రాన్స్‌జెండర్, ఖ్విర్) కమ్యూనిటీని టార్గెట్ చేస్తూ డ్రగ్స్ విక్రయించేందుకు ప్రయత్నిస్తూ ఓ డ్రగ్స్ పెడ్లర్ పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో ఈ విషయంపై వెలుగులోకి వచ్చింది.
ఈ కమ్యూనిటీకి డ్రగ్ విక్రయం ఎవరికి అనుమానం రాదనే భావనతో డ్రగ్ పెడ్లర్స్ కొత్త రూట్లలో హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నారు. ఆయా గ్రూప్‌లలో కొందరిని పరిచయం చేసుకుంటూ ఆ కమ్యూనిటీకి ఈ డ్రగ్ పెడ్లర్స్ దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. సాధారణ ప్రజలకు డ్రగ్స్ విక్రయించాలంటే పబ్‌లు, బార్లు, వివిధ రకాలైన ఈవెంట్స్ జరిగే సమయంలో అక్కడికి వచ్చే వారిని పరిచయం చేసుకుంటూ తమ వద్ద ఉన్న డ్రగ్స్ విక్రయించాలి. పరిచయం ఉన్న వారి ద్వారా కొత్తవారికి విక్రయిస్తుంటారు. డ్రగ్ విక్రయాలపై దేశ వ్యాప్తంగా పోలీసుల నిఘా పెరిగింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పోలీసులు నిఘా పెంచారు.