మూసీ నది ప్రక్షాళనలో భాగంగా బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ పరిధిలోని ఇండ్లను ఎప్పటికైనా తొలగించాల్సిందేనని మూసీ రివట్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ దాన కిశోర్ స్పష్టం చేశారు. ప్రజల కోసమే మూసీ ప్రక్షాళన చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. మూసీ, హైడ్రాపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దాన కిశోర్ మాట్లాడారు.
గతంలో మూసీకి భారీగా వరదలు వచ్చేవి. ఆ వరదల సమయంలోనూ నిర్వాసితులను తరలించారు. గతంలో మూసీ సుందరీకరణకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య పలు సూచనలు చేశారు. 1927లో వరదల వల్ల భారీ నష్టం జరిగింది. ఇటీవల భారీ వర్షాలు కురిసి హైదరాబాద్ మునిగిపోయింది. మొన్న దాదాపు 9 సెం.మీ. పైగా వర్షాలు హైదరాబాద్‌లో కురిశాయి. చిన్న వర్షానికే సచివాలయం ముందు వరద పోటెత్తింది. భారీ వర్షపాతం నమోదైతే అధికారులు కూడా ఏం చేయలేరు. ప్రజల కోసమే మూసీ అభివృద్ధి చేస్తున్నాం. మూసీ నది సుందరీకరణ కోసం ఈ చర్యలు తీసుకోవడం లేదు. మూసీ వరదల వల్ల బాధపడేది ప్రజలే. ఈ సిటీని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని సీఎం నిర్ణయించారు. చారిత్రాత్మక ప్రదేశాలను అద్భుతంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించిందని దాన కిశోర్ తెలిపారు.
హైదరాబాద్‌లో ప్రస్తుతం కోటి జనాభా ఉంది. మూసీ పరివాహ ప్రాంతం మురికి కూపంలా మారింది. మూసీకి వరదలు వేస్తే ఇబ్బందులు పడేది ప్రజలే. మూసీ పరిధిలోని ఎమ్మెల్యేలను తీసుకొని క్షేత్ర పర్యటనకు వెళ్తాం. 2030 కల్లా హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థ 250 బిలియన్ డాలర్లకు చేరుతుంది. మూసీలోకి వచ్చే నీటిని శుద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. మూసీకి వచ్చే నీటిని శుద్ధి చేసేందుకు రూ. 3800 కోట్ల వ్యయం చేస్తున్నాం. 2026 జూన్ లోపు మూసీలో మంచినీళ్లు ప్రవహించాలని సీఎం ఆదేశించారు. బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ పరిధిలోని ఇళ్లను ఎకప్పటికైనా తొలగించాల్సిందే. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయిస్తాం. మూసీ నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటాం అని దాన కిశోర్ పేర్కొన్నారు.