ఎప్పుడెప్పుడా అని నేతలంతా ఆశగా ఎదురుచూస్తున్న కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అధిష్టానం కీలక పెద్దలతో భేటీ అవుతారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలతో పాటు కేబినెట్ విస్తరణపై కీలకంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. గతంలోనే మంత్రివర్గ విస్తరణ చేస్తారని పలుమార్లు ప్రచారం జరిగినప్పటికీ వాయిదా పడింది.
అయితే మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఖచ్చితంగా కేబినెట్ విస్తరణ ఉంటుందని.. పీసీసీ చీఫ్‌తో పాటు పలువురు సీనియర్ నేతలు కూడా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నేడు సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనపై నేతలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7తో ఏడాది పూర్తవుతుంది. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. ఆలోపే కొత్త మంత్రుల ఎంపిక పూర్తిచేయనున్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు, గడ్డం సోదరుల పేర్లు వినిపిస్తుండగా.. నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావు, మహబూబ్‌నగర్ మక్తల్ నుంచి వాకిటి శ్రీహరి పేర్లు చర్చకు వస్తున్నాయి. అలాగే ఎస్టీ కోటాలో బాలునాయక్ పేరు కూడా పరిశీలనలో ఉంది. ఇక.. నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి వర్గంలో కీలక శాఖకు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు కూడా బలంగా వినిపిస్తోంది.