పురుగుల మందు డబ్బాలతో ఆందోళన
పోలీసులపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు
గత రాత్రి నిర్మల్ ఆర్డీఓ కారుపై దాడి, నిప్పు
లగచర్ల ఘటన మరవక ముందే.. మరో ఘటన
నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపట్టారు. పురుగుల మందు డబ్బాతో రోడ్డుపై నాలుగు గ్రామాల ప్రజలు రోడ్డుపై బైఠాయించారు. అదే సమయంలో అక్కడి వచ్చిన పోలీసులపై ఆందోళనకారులు రాళ్ళూ రువ్వారు. దీంతో అక్కడ మరోసారి ఉద్రిక్తత నెలకొంది.
దిలావర్పూర్ అట్టుడుకుతోంది. ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. గతరాత్రి నిర్మల్ ఆర్డీవో కారుపై దాడికి యత్నించారు. కారుపై దాడి చేసి నిప్పు పెట్టారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది.
లగచర్ల ఘటన మరవకముందే..
ఫార్మా కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ.. ఇటీవల వికారాబాద్ జిల్లా లగచర్లలో జిల్లా కలెక్టర్ బృందంపై రైతులు, గ్రామస్థులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘనటలో పలువురు అధికారులు తీవ్రంగా గాయపడగా.. కలెక్టర్‌తో పాటు ఇతరుల వాహనాలు ధ్వంసం చేశారు. ఈ ఘటన మరవక ముందే నిర్మల్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. దిలావర్పూర్ ,గుండవపల్లి గ్రామాల మధ్య ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో రెండ్రోజులుగా స్థానికులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
గ్రామాల్లో ఉద్రిక్తత..
దీంతో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులతో చర్చించేందుకు నిర్మల్ ఆర్డీవో రత్న కల్యాణి మంగళవారం (నవంబర్ 26) రాత్రి అక్కడకు చేరుకున్నారు. వారితో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. స్థానికులు వినిపించుకోలేదు. ఆర్డీవోను కారులోనే నిర్భందించారు. కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టమని స్పష్టమైన హామీ ఇస్తేనే ఆర్డీవోను విడిచిపెడ్తామని తెగేసి చెప్పారు.
ఆర్డీఓ కారు అద్దాలు ధ్వంసం..
ఆర్డీవోను పోలీసుల సాయంతో పంపేందుకు ప్రయత్నం చేయగా.. ఆందోళనకారులు రెచ్చిపోయారు. ఆర్డీవో కారుపై దాడికి యత్నించారు. కారు అద్దాలు ధ్వసం చేయటంతో పాటుగా.. కారుపై మండుతున్న కర్రలు విసిరేశారు. ఈ క్రమంలో ఓ మహిళా ఎస్సైకి గాయాలయ్యాయి. పరిస్థితి చేయిదాటే ప్రమాదం ఉండటంతో పోలీసులు అప్రమత్తమై మరో వాహనంలో ఆర్డీవోను అక్కడి నుంచి పంపించేశారు.
రోడ్లపైకి రైతులు..
బుధవారం ఉదయం దిలావర్పూర్ గ్రామానికి పెద్ద ఎత్తున చేరుకున్న పోలీసులు గతరాత్రి దాడిలో పాల్గొన్న రైతులను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో గ్రామస్తులు వారిని అడ్డుకున్నారు. ఉదయం నుంచి నిరసనకారులను పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించటంతో రోడ్లపైకి వచ్చి వాహనాలను అడ్డుకున్నారు. గ్రామం నుంచి వెళ్లిపోవాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇథనాల్ పరిశ్రమ తరలించేంతవరకు ఎన్ని అక్రమ అరెస్టులు జరిగినా భయపడేది లేదని రైతులు తేల్చి చెప్పారు.
మూకుమ్మడిగా బయటకు వచ్చి..
గ్రామస్తులంతా మూకుమ్మడిగా ఇళ్లలో నుంచి బయటకు వచ్చి రోడ్లపై నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలోని ప్రధాన కూడలిలో పోలీసు బలగాలు పహార కాస్తున్న లెక్క చేయకుండా వందల సంఖ్యలో గ్రామస్తులు ర్యాలీగా రోడ్ల పైకి వచ్చి ఆందోళలు వ్యక్తం చేశారు.