ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజనం వికటించిన ఘటనలపై దాఖలైన పలు పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ జరిపింది. ప్రభుత్వం నిర్దేశించిన రీతిలో పోషకాలతో కూడిన భోజనాన్ని విద్యార్థులకు వడ్డించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలకు సంబంధించిన నివేదికను సమర్పించాలని కోరింది. ఈ పిటిషన్లపై తదుపరి విచారణను 6 వారాలపాటు వాయిదా వేసింది.
రెండు కమిటీలు ఏర్పాటు చేశాం: ఏఏజీ
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధె, జస్టిస్ జె.శ్రీనివాస్రావులతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోర్టుకు పలు వివరాలు అందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వికటించిన ఘటనలపై పరిశీలన కోసం రెండు కమిటీలను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తరపున ఏఏజీ న్యాయస్థానానికి తెలిపారు. బాధ్యులను ఇప్పటికే సస్పెండ్ చేసినట్లు కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. 25,941 ప్రభుత్వ పాఠశాలల్లో 18 లక్షల మందికి పైగా విద్యార్థులు ఉన్నట్లు వెల్లడించారు. వారిలో 75 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత అస్వస్థతకు గురైనట్లు వివరించారు.