రెండు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీలోకి చాలా మంది చేరారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ కు దూరమైన చాలా మంది మళ్లీ ఘర్ వాపసీ అయ్యారని చెప్పారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని కూడా చాలా మందిని పార్టీలోకి చేర్చుకున్నామని తెలిపారు. ఇప్పటి నుంచి పార్టీలోకి నేరుగా చేరికలు ఉండవని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జీ దీపాదాస్ మున్షీ అనుమతితోనే చేరికలు ఉంటాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో చేరాలనుకునే వారు దీపాదాస్ మున్షీని సంప్రదించాలని సూచించారు.
కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు ఇటీవల పెద్ద సంఖ్యలో ఇతర పార్టీల వారిని కాంగ్రెస్ లోకి చేర్చుకున్నారు. పార్టీలో చేరేవారిని బేషరతుగా ఆహ్వానించాలని, అన్ని నియోజకవర్గాల నుంచి నాయకులను పార్టీలోకి తీసుకోవాలని హైకమాండ్ తెలిపింది. ఈ నేపథ్యంలో పార్టీ చేరికల కమిటీ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు.