హైదరాబాద్ నగరంలో గురువారం కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. కుండపోతగా వర్షం కురవడంతో పలు కాలనీల్లోకి చేరిన భారీగా నీరు చేరింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, ఏరియాల్లో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. బంజారాహిల్స్ డివిజన్లోని ఉదయ నగర్ కాలనీలో నాలా స్లాబ్ కొట్టుకుపోయింది. అదే ప్రాంతంలో వర్షం దాటికి టూ వీలర్లు సైతం నీటిలో కొట్టుకుపోయాయి. చాలా చోట్ల రోడ్లు జలమయం కావడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కుండపోతగా వర్షం పడడటంతో హైదరాబాద్ నగరంలో భారీగా వర్షపాతం నమోదైంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ప్రాంతంలో అత్యధికంగా 9.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.
వివిధ ప్రాంతాల్లో వర్షపాతం వివరాలు
మలక్‌పేట 8.4 సెంటిమీటర్లు
బంజారాహిల్స్ 8.3 సెంటీమీటర్లు
బేగంబజార్ 8.1 సెంటీమీటర్లు
గోల్కొండ 7.5 సెంటీమీటర్లు
కృష్ణానగర్ 7.45 సెంటీమీటర్లు
ఆస్మాన్‌ఘఢ్ 7.3 సెంటీమీటర్లు
గోల్కొండ 7.2 సెంటీమీటర్లు
మాదాపూర్ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్
హైదరాబాద్‌లో కురిసిన వర్షానికి వరద నీరు రహదారులపై చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మాదాపూర్ నుంచి కేపీహెచ్‌పీ వైపు వెళ్లే మార్గంలో సైబర్ టవర్స్ వద్ద వరద నీరు చేరడంతో ట్రాఫిక్ జామయింది. మాదాపూర్ మైండ్ స్పేస్ నుంచి ఐకియా మార్గంలో వాహనాలు మెల్లగా కదులుతున్నాయి. ఐటీ ఉద్యోగులు విధులు ముగించుకుని కార్యాలయాల నుంచి ఒకేసారి బయటికి రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మాదాపూర్‌లోని నెక్టార్ గార్డెన్, శిల్పారామం సైబర్ గేట్ వే రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.