ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావంతో వాయవ్య, పరిసర మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 23న అల్పపీడనం ఏర్పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం మరో ఆవర్తనం పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నట్లు చెప్పింది. దీంతో హైదరాబాద్ సహా తెలంగాణలోని చాలా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
హైదరాబాద్‌లో శనివారం సాయంత్రం ఆకాశం మేఘావృతమైంది. రాత్రి 7 గంటల నుంచి సిటీలోని చాలా ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. ఆఫీసుల నుంచి ఇళ్లకు తిరుగుపయనమైన వారు ఒక్కసారిగా రోడ్లపైకి రావడం, అదే సమయంలో వర్షం కురవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఆవర్తనం ప్రభావంతో ఆదివారం సైతం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. భారత వాతావరణ శాఖ మరో రెండ్రోజులపాటు రాష్ట్రానికి యెల్లో అలెర్ట్ జారీ చేసింది.