AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

BPSC ప్రిలిమ్స్ పేపర్ లీక్ అయ్యిందా.. కమిషన్ ఛైర్మన్ క్లారిటీ

బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) 70వ ప్రిలిమినరీ పరీక్షలో ప్రశ్నపత్రం లీక్ అయిందన్న వార్త ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. ఓ నివేదిక ప్రకారం ప్రశ్నపత్రం లీక్ అయ్యిందన్న వాదనల నేపథ్యంలో, విద్యార్థులు పాట్నాలోని బాపు ఆడిటోరియంలో నిరసన ప్రదర్శన చేశారు. కమిషన్‌ దీనికి జవాబుదారీతనం వహించాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. అయితే ఈ వాదనలను కమిషన్ పూర్తిగా తిరస్కరించింది. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ రవి మను భాయ్ పర్మార్ విలేకరుల సమావేశంలో ప్రశ్నపత్రం లీక్ అయ్యే అవకాశాలను ఖండించారు. ఈ క్రమంలో క్వశ్చన్ పేపర్ లీక్ వార్తలను పుకార్లేనని పేర్కొన్నారు.

912 కేంద్రాల్లో ఎగ్జామ్

పూర్తి పారదర్శకత, కట్టుదిట్టమైన భద్రతతో పరీక్ష నిర్వహించామని కమిషన్‌ ఛైర్మన్‌ పర్మార్‌ రవి మానుభాయ్‌ స్పష్టం చేశారు. వివిధ రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాలు ప్రింట్ అయ్యాయని, పరీక్ష ప్రారంభానికి మూడు గంటల ముందు ఏ సెట్‌ను ఏ సెంటర్‌కు పంపాలో లాటరీ ద్వారా నిర్ణయించామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని 912 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించగా, 911 కేంద్రాల్లో పరీక్ష ప్రశాంతంగా ముగిసిందన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ఒకే షిప్టులో పరీక్ష నిర్వహించారు. పరీక్ష మధ్యలో మధ్యాహ్నం 1 గంట తర్వాత ప్రశ్నపత్రం లీక్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

బయటకు వచ్చి వీరంగం

ఆ క్రమంలోనే బీపీఎస్సీ పరీక్షలో అవకతవకలు నేపథ్యంలో తనకు ప్రశ్నపత్రం ఆలస్యంగా అందిందని ఒకరు ఆరోపించారు. దీంతో పలువురు పరీక్ష సమయంలో ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్ షీట్లతో బయటకు వచ్చి ప్రశ్నపత్రాలను చించేశారు. మరికొంత మంది ఇన్విజిలేటర్‌ చేతిలోని ప్రశ్నపత్రాన్ని లాక్కొని పారిపోయారని, బయట కూడా వీరంగం సృష్టించారని ఛైర్మన్ పేర్కొన్నారు. ఈ అంశంపై విచారణ జరుగుతుందని, విచారణ అనంతరం నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై డీఎం నివేదిక కూడా వస్తుందని వెల్లడించారు. ఈ క్రమంలో ప్రశ్నపత్రం లీక్‌పై పుకార్లు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పుకార్లను పట్టించుకోవద్దని విద్యార్థులు, తల్లిదండ్రులకు కమిషన్ విజ్ఞప్తి చేసింది.

 

అసలు విషయం ఏమిటి?

బీపీఎస్సీ 70వ కంబైన్డ్ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి ఈ వార్త ప్రచారం జరుగుతోంది. రాజధాని పాట్నాలోని 60 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 4 లక్షల 83 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఘటన తర్వాత పాట్నాలోని బాపు ఆడిటోరియంలో విద్యార్థులు నిరసనకు దిగారు. జిల్లా మేజిస్ట్రేట్ చంద్రశేఖర్ సింగ్ పాట్నా ఎస్‌ఎస్‌పీ రాజీవ్ మిశ్రాతో కలిసి బీపీఎస్‌సీ అభ్యర్థుల ఆందోళనను పరిష్కరించడానికి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ క్రమంలో అధికారులు విద్యార్థులకు విషయాలు వివరిస్తుండగా, పాట్నా డీఎం రచ్చ సృష్టిస్తున్న విద్యార్థుల్లో ఒకరిని చెప్పుతో కొట్టారు. దీంతో ఇది కాస్తా చర్చనీయాంశంగా మారింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10