AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌గా గుకేశ్‌ రికార్డు

అతి పిన్న వయసులోనే ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌గా దొమ్మరాజు గుకేశ్‌ రికార్డు సృష్టించాడు. 18 ఏళ్ల వయసులోనే ఫిడె ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ సొంతం చేసుకున్నాడు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అయిన చైనాకు చెందిన డింగ్‌ లిరెన్‌తో జరిగిన తుది పోరులో విజేతగా నిలిచాడు. గురువారం జరిగిన 14వ రౌండ్‌ (చివరి క్లాసికల్‌ గేమ్‌)లో డింగ్‌ 6.5 పాయింట్లు సాధించగా.. గుకేశ్‌ 7.5 పాయింట్లు సాధించాడు. 2012లో విశ్వనాథ్‌ ఆనంద్‌ తర్వాత ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ గెలుచుకున్న రెండో భారతీయుడిగానూ గుకేశ్‌ చరిత్ర సృష్టించాడు.

సింగపూర్‌లో జరిగిన ఫిడే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీలో డింగ్‌ లిరెన్‌, గుకేశ్‌ మధ్య గట్టి పోటీనే జరిగింది. వీరిద్దరి మధ్య బుధవారం జరిగిన 13వ రౌండ్‌లోనే ఫలితం తేలాల్సి ఉంది. కానీ ఇద్దరూ ఒకరి ఎత్తులను మరొకరు చిత్తు చేస్తూ దాదాపు 5 గంటల పాటు ఉత్కంఠగా పోటీ పడ్డారు. అయినప్పటికీ ఇద్దరూ చెరో 6.5 పాయింట్లతో సమానంగా పోటీ పడ్డారు. దీంతో 68 ఎత్తుల తర్వాత ఇద్దరు ఆటగాళ్లు ఫలితం తేలకుండానే గేమ్‌ ముగించేందుకు అంగీకరించారు. ఇవాళ జరిగిన చివరి క్లాసికల్‌ గేమ్‌లో డింగ్‌ లిరెన్‌ 6.5 పాయింట్లు సాధించగా.. గుకేశ్‌ 7.5 పాయింట్లు స్కోర్‌ చేసి విజేతగా నిలిచాడు.

గుకేశ్‌ పెరిగింది తమిళనాడులోని చెన్నైలో అయినప్పటికీ అతని స్వస్థలం ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా. గుకేశ్‌ తండ్రి రజినీకాంత్‌ సర్జన్. ఏడేళ్ల వయసులోనే గుకేశ్‌ చెస్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. అదే మక్కువతో చెస్‌ పోటీల్లో అనేక విజయాలను సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే ఏసియన్‌ చెస్‌ ఫెడరేషన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2023గా రికార్డు సృష్టించాడు. తాజాగా 18 ఏళ్ల వయసులో చెస్‌ ఛాంపియన్‌గా నిలిచాడు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10