తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికలు గడిచి ఏడాది అయినా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇంటికే పరిమితమయ్యారు. పార్టీ వ్యవహారాలు చూస్తున్న కేటీఆర్‌కు కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. ఫార్ములా ఈ–కారు రేసులో అవినీతి ఆరోపణల నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపినట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆయనను విచారించేందుకు సన్నద్ధం అవుతోంది. దీంతో త్వరలో అరెస్టుకు రంగం సిద్ధం అయినట్లు సమాచారం.
నిధుల కేటాయింపులో భారీ అవినీతి..
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ వేదికగా గతేడాది ఫిబ్రవరిలో ఫార్ములా ఈ–కారు రేస్ జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఫార్ములా ఈ–కారు రేసు నిధుల కేటాయింపులలో భారీ అవినీతి జరిగినట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ సంస్థ ఏసీబీకి ఫిర్యాదు చేసింది. దీంతో ఈ కేసులో ఇప్పటికే ఉన్న ఇద్దరు పురపాలక శాఖ అధికారులతో పాటు అప్పట్లో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్‌పై కేసు నమోదు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఇద్దరు అధికారులపై విచారణకు అనుమతించింది. అలాగే ప్రజాప్రతినిధిగా ఉన్న కేటీఆర్‌పై కేసు నమోదు కోసం అనుమతి ఇవ్వాలని గవర్నర్‌ను కోరింది. దీనిపై న్యాయ సలహా మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కేటీఆర్‌ను విచారించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
అడ్డంగా దొరికిన కేటీఆర్..
మిగతా కేసు విషయం కాసేపు పక్కనబెడితే, ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ అడ్డంగా ఇరుక్కున్నారన్నది అధికార పార్టీ నేతల మాట. ప్రభుత్వం పంపిన దస్త్రానికి రెండు రోజుల కిందట గవర్నర్ ఆమోద ముద్ర వేశారట. దీంతో కేటీఆర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు మార్గం సుగమమైంది. కేటీఆర్‌తోపాటు అప్పటి పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఇందులో ఇరుక్కునే అవకాశాలు న్నాయట.
అసలేం జరిగింది..
బీఆర్‌ఎస్ హయాంలో హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేస్ నిర్వహించారు. దీనికి సంబంధించి నిధుల అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి గానీ, ఆర్బీఐ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఓ విదేశీ కంపెనీకి అప్పటి ప్రభుత్వం నిధులు చెల్లించింది. దాదాపు 46 కోట్ల రూపాయలు విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించింది అప్పటి మున్సిపల్ శాఖ. అయితే చెల్లింపుల్లో ఇటు హెచ్‌ఎండీఏ బోర్డు నుంచి అనుమతి పొందలేదు. అలాగే అప్పటికే కేసీఆర్ కేబినెట్ లో ప్రస్తావించలేదు. ఒక విదేశీ సంస్థకు నిధులు ఇవ్వాలంటే ఆర్బీఐ నుంచి కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
నిబంధనలకు తిలోదకాలు..
ఆ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చేసింది అప్పటి కేసీఆర్ సర్కార్. కొత్తగా వచ్చిన రేవంత్ సర్కార్ దీనిపై ఫోకస్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అక్టోబరులో ఏసీబీ.. ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం జరిగిపోయింది. గవర్నర్‌ను రేవంత్ సర్కార్ సంప్రదించడం జరిగిపోయింది. లేటెస్ట్‌గా గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అంతర్గత సమాచారం. రేపో మాపో ఆ కేసు స్పీడ్ అందుకోనుంది. మొత్తానికి రాబోయే రోజుల్లో కేటీఆర్‌కు ఇబ్బందులు తప్పవన్నమాట.