ఆశావర్కర్లకు వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తీపికబురు వినిపించారు. ఆశావర్కర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ప్రకటించారు. వారి డిమాండ్లను ఒకొక్కటిగా పరిష్కరించేందుకు సర్కార్ అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రాజకీయ నాయకుల ట్రాప్‌లో పడొద్దని.. వారి ఉచ్చులో ఇరుక్కుని భవిష్యత్తు పాడుచేసుకోకండని మంత్రి రాజనర్సింహ సూచించారు. తెలంగాణలో నిరసనలు చేయడం కొత్తేమీ కాదని.. నిరసనలకు తమ ప్రభుత్వం అవకాశం కూడా ఇచ్చిందని తెలిపారు. అయితే.. రాజకీయంగా నాయకులు లబ్ధి పొందేందుకు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తే ఆ ట్రాప్‌లో పడొద్దని ఆశావర్కర్లకు మంత్రి సూచించారు.
ఆర్థిక పరిస్థితులు బేరీజు వేసుకొని సమయానుకూలంగా అన్ని డిమాండ్లను పరిష్కరిస్తామని ఆశావర్కర్లకు మంత్రి రాజనర్సింహ హామీ ఇచ్చారు. ఆరు డిమాండ్లను ఒకదాని తర్వాత ఒకటిగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వం వచ్చి ఏడాది మాత్రమే పూర్తయిందని తెలిపిన మంత్రి రాజనర్సింహా.. ఆశావర్కర్ల పట్ల ఏనాడూ వ్యతిరేకంగా మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. కాగా.. మంత్రి రాజనర్సింహా చేసిన వ్యాఖ్యలతో ఆశావర్కర్ల డిమాండ్లు త్వరలోనే పరిష్కారమవనున్నట్టు భావిస్తున్నారు
ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ నేతలపై మంత్రి రాజనర్సింహా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ధర్నాచౌక్ మాయం చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని.. అలాంటి వారే ఇప్పుడు ఆశావర్కర్లకు మద్ధతు తెలపడం హాస్యాస్పదమని మంత్రి దుయ్యబట్టారు. గత పదేళ్లలో ఆశావర్కర్ల సమస్యలు పరిష్కరించకపోవడం వల్లే.. ఈరోజు రోడ్డెక్కి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు.
ఆశావర్కర్లను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం ప్రతిపక్ష పార్టీ నాయకుల దిగజారుడు తనానికి నిదర్శనని మంత్రి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని చాటేలా ప్రజా విజయోత్సవాలు జరుగుతుంటే తట్టుకోలేని ప్రతిపక్ష పార్టీ నేతలే.. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఆశావర్కర్లను రెచ్చగొట్టారని ఆరోపించారు. గత పదేళ్లలో ఆశావర్కర్లు తమ జీతాలు పెంచాలని ఎన్నిసార్లు నిరసనలు, ధర్నాలు చేపట్టారో గుర్తు తెచ్చుకోవాలన్నారు. అప్పుడు ఏమాత్రం పట్టించుకోనివాళ్లు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు.
జీతాలు పెంచాలంటూ 2015లో ఏకంగా 106 రోజుల పాటు ధర్నా చేసిన ఆశా వర్కర్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలే లేవని మంత్రి రాజనర్సింహ తెలిపారు. 2018, 2020, 2021, 2023 సంవత్సరాల్లో కూడా ఆశావర్కర్లు సమ్మెలు, ధర్నాలు చేశారని మంత్రి దామోదర్ రాజనర్సింహ గుర్తు చేశారు. అప్పుడు ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించని వాళ్లు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రశ్నించారు. ఇది ద్వంద వైఖరికి నిదర్శనమన్నారు.