బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడవ టెస్టు మ్యాచ్‌లో 2వ రోజు ఆట పూర్తయింది. ముగింపు సమయానికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్లు కోల్పోయి 405 పరుగుల భారీ స్కోరు సాధించింది.
వర్షం కారణంగా మొదటి రోజు ఆట నిలిచిపోగా… ఓవర్‌నైట్ స్కోరు 38/0 నుంచి ఆదివారం ఆస్ట్రేలియా బ్యాటింగ్ కొనసాగించింది. ఉస్మాన్ ఖవాజా 21, మెక్స్వినీ 9, మార్నస్ లబుషేన్ 12, స్టీవెన్ స్మిత్ 101, ట్రావిస్ హెడ్ 152, మిచెల్ మార్ష్ 5, అలెక్స్ క్యారీ 45 (బ్యాటింగ్), ప్యాట్ కమ్మిన్స్ 20, మిచెల్ స్టార్క్ 7 (బ్యాటింగ్) చొప్పున పరుగులు సాధించారు.
భారత బౌలర్లలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి మెరిశాడు. 5 కీలకమైన వికెట్లు పడగొట్టాడు. సెంచరీ హీరోలు ట్రావిస్ హెడ్, స్మిత్, ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా, మెక్స్వినీ, మిచెల్ మార్ష్‌లను ఔట్ చేశాడు.
మహ్మద్ సిరాజ్, నితీశ్ కుమార్ రెడ్డి చెరో వికెట్ తీశారు. మొత్తంగా చూస్తే రెండవ రోజున ఆస్ట్రేలియా సంపూర్ణ ఆధిపత్యం కనబరిచింది. ఆసీస్ బ్యాటర్లు వన్డే తరహాలో బ్యాటింగ్ చేశారు. సగటున ఓవర్‌కు నాలుగుకు పైగా పరుగులు బాదారు.