హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ చీఫ్ ఓం ప్రకాశ్ చౌతాలా కన్నుమూశారు. 89 ఏళ్ల వయసు కల్గిన ఆయన గురుగ్రామ్‌లోని ఆయన నివాసంలో నేడు హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులను ఆయనను వెంటనే స్థానికంగా ఉన్న మేదాంత ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. 1935వ సంవత్సరం జనవరి 1వ తేదీన సిర్సాలో జన్మించిన ఓం ప్రకాశ్ చౌతాలాకు ముందు నుంచీ రాజకీయాలపై ఆసక్తి ఉండేది. ఈక్రమంలోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు.
అయితే 1989వ సంవత్సరంలో ఆయన తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు. మొత్తం 6 నెలల పాటు సీఎంగా పని చేశారు. ఆ తర్వాత ఎన్నికల్లో గెలుపొందిన ఆయన ప్రమాణ స్వీకారం చేసిన ఐదు రోజులకే పదవి నుంచి వైదొలిగారు. 1991లో మూడోసారి మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కానీ రాష్ట్రపతి పాలను విధించడంతో కేవలం రెండు వారాల్లోనే పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత 1999 నుంచి 2005 వరకు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇలా ఓం ప్రకాశ్ చౌతాలా రికార్డు స్థాయిలో ఐదు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.