సృష్టిలో ఎక్కడైనా తల్లిదండ్రులు పిల్లల్ని నమ్ముతారు. ఆ పిల్లలు కూడా తల్లిదండ్రుల పట్ల వినయ విధేయతలు కలిగి ఉంటారని, తమ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నడుచుకుంటారని తల్లిదండ్రులు భావిస్తారు. కానీ కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు షాక్ కు గురయ్యే పనులు చేస్తున్నారు.
హైదరాబాద్లోని మల్కాజ్ గిరి వాణి నగర్ లో నివాసం ఉండే శివమ్మ, మల్లయ్య దంపతులు తాజాగా కూతురి ఇంటి ముందు కూర్చుని ఆందోళన చేయడం ప్రతి ఒక్కరిని షాక్ కు గురి చేసింది. ఎందుకు ఈ వృద్ధ దంపతులు కూతురి ఇంటి ముందు ఆందోళన చేస్తున్నారని తెలుసుకున్న ప్రతి ఒక్కరు అవాక్కయ్యేలా చేసింది. వాణి నగర్ లో నివసించే శివమ్మ, మల్లయ్య దంపతులకు ఇద్దరు మగ పిల్లలు ఒక ఆడబిడ్డ.
బంగారం తీసుకుని తిరిగివ్వని కూతురు..
ఇటీవల తీర్థయాత్రలకు వెళుతున్న క్రమంలో కొడుకు కోడళ్ళ బంగారం సుమారు 30 తులాలు జాగ్రత్తగా భద్రపరచమని, అదే వీధిలో నివసించే కూతురు బాలామణికి ఇచ్చామని వారు చెబుతున్నారు. తీర్థయాత్ర నుంచి తిరిగి వచ్చిన తర్వాత బంగారం అడిగితే మీరు నాకు బంగారం ఇచ్చినట్టు ఆధారం ఏముందని తమను ఇంటి నుంచి గెంటివేసిందని వృద్ధ దంపతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన..
తాము ఇచ్చిన బంగారం మళ్ళీ తిరిగి తమకు ఇవ్వాలని వృద్ధ దంపతులు కూతురి ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. కూతురు బాలామణి ఉపాధ్యాయురాలు కావడంతో తాను చదువు చెప్పే స్కూల్ వద్దకు వెళ్లిన ఎవరు తమ గోడు పట్టించుకోలేదని తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని అందుకే ఆందోళన చేస్తున్నామని వారు అంటున్నారు.