మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్
బీఆర్‌ఎస్ ఛార్జిషీట్ విడుదల
కేసీఆర్ పాలనలో ఇరిగేషన్ పెరిగితే.. రేవంత్ పాలనలో ఇరిటేషన్ పెరిగిందని బీఆర్‌ఎస్ మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యంగా మారిందని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలోనూ ఇలాంటి నిర్బంధాలు, నిరంకుశత్వం చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూళ్ల ముందు పోలీస్ పికెట్ల గురించి ఏనాడైనా విన్నామా అని ప్రశ్నించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా నిర్బంధాలు కొనసాగుతున్నాయని చెప్పారు. తెలంగాణ భవన్‌లో కాంగ్రెస్ ఏడాది పాలనపై ‘ఏడాది పాలన–ఎడతెగని వంచన’ పేరుతో బీఆర్‌ఎస్ ఛార్జిషీట్‌ను విడుదల చేశారు.
ప్రజాస్వామ్యం ఖూనీ..
ఈ సందర్భంగా హరీశ్ మాడారు.. ‘కాంగ్రెస్ ఏడాది పాలనలో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా నిర్బంధాలు కొనసాగుతున్నాయి. ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. మీడియా, సోషల్ మీడియాలపై ఆంక్షలు విధించారు. బీఆర్‌ఎస్ నాయకులు, ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నారు. గిరిజన బిడ్డల మీద లాఠీచార్జి చేశారు. తిట్లు, ఒట్లు, పోట్లు ఇదే రేవంత్ పాలన. పోలీసులతోనే పోలీసు కుటుంబాలను కొట్టించారు. ప్రతికూల దృక్పథంతో రేవంత్ పాలన ప్రారంభమైంది. ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం ఢమాలైంది. 6 గ్యారంటీలు, 420 హమీల అమలులో కాంగ్రెస్ విఫలమైంది. సీఎం ఛాంబర్‌కు ఎవరూ వెళ్లకుండా ఆంక్షలు విధించారని ’ అన్నారు.
అన్ని రంగాల్లో విఫలం..
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ డ్యామేజీ అయిందని హరీశ్ అన్నారు. ఖమ్మం, మహబూబాబాద్ వరద సహాయక చర్యల్లోనూ ఘోరంగా విఫలమైందని, వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన తమపై రాళ్ల దాడి చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆందోళనలు, అలజడులు పెరిగిపోయాయని, బస్సుల సంఖ్య పెంచకపోవడంతో ప్రయాణికులు కొట్టుకుంటున్నారని వాపోయారు.
విద్యా భరోసా ఏదీ?
విద్యా భరోసా కింద రూ.5 లక్షలు ఇస్తామని మోసం చేశారని హరీశ్ అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్æ ఇవ్వకుండా విద్యార్థులను మోసం చేశారని అన్నారు. ‘పదేండ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.4.26 లక్షల కోట్లు అప్పుచేస్తే.. రేవంత్ సర్కార్ ఏడాదిలోనే రూ.లక్ష కోట్లు అప్పు చేసింది. కాళేశ్వరం నీళ్లు లేకుండానే కోటీ 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండిందని ముఖ్యమంత్రి సహా మంత్రులంతా అబద్ధాలు చెబుతున్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో 68 లక్షల మెట్రిక్ టన్నుల వరి పంటనే ఎలా పండింది?. కేసీఆర్ హయాంలో వరి పంట కోటీ 60 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. కేసీఆర్ ఏమీ చేయకుండానే కోటి మెట్రిక్ టన్నుల పంట పెరిగిందా?. కాళేశ్వరం ప్రాజెక్టు సహా అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాం. మిషన్ కాకతీయలో భాగంగా వేలాది చెరువులు బాగుచేశాం. వేలాది చెక్‌డ్యాములు నిర్మించి నీళ్లు అందించాం. ఏడాదికి 6.5 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు తీసుకొస్తామని మంత్రి ఉత్తమ్ చెప్పారు. ఏడాదిలో 6,500 ఎకరాలైనా కొత్త ఆయకట్టు వచ్చిందా?. పాలమూరు బిడ్డనని చెప్పుకునే నైతిక అర్హత రేవంత్‌రెడ్డికి లేదు. కేసీఆర్ పాలనలో ఇరిగేషన్ పెరిగింది. రేవంత్ పాలనలో ఇరిటేషన్ పెరిగిందని’ హరీశ్ ఆరోపించారు.
అంతా మోసం..
‘అన్ని పంటలకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. బోనస్‌ను బోగస్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడేమో సన్నవడ్లకే బోనస్ మాటమార్చారు. మద్దతు ధరకంటే తక్కువకే రైతులు ధాన్యం అమ్ముకున్నారు. రైతుల ధాన్యం సగం దళారుల పాలైంది. వ్యవసాయ డిక్లరేన్ లోని 9 హమీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేలు ఇస్తామని మోసం చేశారు. కౌలు రైతులకు కూడా రైతుబంధు ఇస్తామని మోసం చేశారు. ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రేవంత్ మోసం చేశారని అన్నారు.
మురికి కూపాలుగా పల్లెలు
‘కేసీఆర్ హయాంలో క్రమం తప్పుకుండా పల్లెప్రగతి, పట్టణ ప్రగతికి నిధులు ఇచ్చేది. రేవంత్ పాలనలో పల్లెలకు నిధులు రాక మురికి కూపాలుగా మారాయి. హరితహారంలో నాటిని మొక్కలకు నీళ్లు పోసే దిక్కులేదు. హైడ్రా పేరుతో పేద, మధ్యతరగతి ప్రజల ఇండ్లు కూల్చారు. కూలగొట్టిన ఇండ్లకు ఎవరు నష్టపరిహారం ఇస్తారు’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు.