కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్ర
తెలంగాణ ప్రభుత్వ వసతి గృహాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆహారం కల్తీ కావడం వెనక బీఆర్ఎస్ పార్టీ రాజకీయ కుట్ర ఉందని సీతక్క ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ నాయకులతో సంబంధం ఉన్న కొంతమంది ఉద్యోగులు ఉద్దేశపూర్వకంగానే ఆహారాన్ని కలుషితం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ అందరూ కలిసి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయం కోసం విద్యార్థులను బలి తీసుకునే కుట్ర జరుగుతోందని మంత్రి ధ్వజమెత్తారు.
ఎవరున్నా వదలం..
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే బీఆర్ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారని సీతక్క ఆరోపించారు. ఉద్యోగులకు కుట్రతో సంబంధం ఉందని తేలితే వారిని విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. కుట్ర వెనక ఏ స్థాయి నేతలున్నా విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. రాజకీయ నేతలతో అధికారులు కుమ్మకైనట్లు తేలిస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అన్ని ఘటనలపై విచారణ చేసి పూర్తి వివరాలను త్వరలోనే బయటపెడతామని మంత్రి సీతక్క తెలిపారు.