గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కు కారణం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటూ మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. ప్రవీణ్ ఆధ్వర్యంలోనే ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగాయని అన్నారు. అంతేకాదు ఫుడ్ పాయిజన్ దుష్ప్రచారపు ఘటనల్లో ఆర్ఎస్పీ పాత్ర ఉందని చెప్పారు. ఈ ఘటనలపై ప్రభుత్వం సమగ్రంగా విచారణ జరిపిస్తుందని, నిందితులను త్వరలోనే పట్టుకుని చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.
ఇక ఎవరెన్ని కుట్రలెన్ని చేసినా ఐదేండ్లు రేవంతన్న పాలనే ఉంటుందని సురేఖ అన్నారు. ప్రజలు ఆశీర్వదీస్తే మరో పదేండ్లు కాంగ్రెస్ పాలనే. కవిత, హరీష్ ఏకమై కేటీఆర్ ని పక్కనబెడుతున్నారు. కేసీఆర్ కుటుంబంలోనే పదవుల కోసం గొడవలు. టైం వచ్చినప్పుడు కేసీఆర్, కేటీఆర్ అరెస్టు అవుతారంటూ తీవ్ర విమర్శలు చేశారు.
నేతల మధ్య మాటల తూటాలు..
ఇదిలా ఉంటే.. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు రాష్ట్రంలో పొలిటికల్‌గా హీట్‌ను రాజేస్తున్నాయి. ఈ విషయంలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. వరుస ఫుడ్ పాయిజన్ ఘటన వెనుక కుట్ర దాగి ఉందంటూ కామెంట్ చేశారు. ఆ కుట్రలు ఎవరు చేశారనే విషయాన్ని త్వరలోనే బయటపెడతామని అన్నారు. ఒకవేళ కుట్రదారుల వెనుక అధికారులుంటే వారిని ఉద్యోగం నుంచి నిర్దాక్షిణ్యంగా తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఫుడ్ పాయిజన్ ఘటన వెనుక ఓ రాజకీయ పార్టీ ఉందని తమకు అనుమానంగా ఉందని తెలిపారు. మరోవైపు గురుకులాల మీద పాలిటిక్స్ చేయొద్దని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
అంతా ఆర్‌ఎస్పీ కనుసన్నల్లోనే: బండ్రు
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ వెనుక బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుట్ర ఉందని కాంగ్రెస్ నాయకురాలు బండ్రు శోభారాణి ఆరోపించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కనుసన్నలలోనే హాస్టళ్లలో కుట్రలు జరుగుతున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్పీ తన స్వేరో నెట్ వర్క్‌తో గురుకులాల్లో సమస్యలను సృష్టిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి సమగ్ర దర్యాప్తు జరిపించి నిజాలు బహిర్గతం చేయాలని కోరారు. లేకుంటే అమాయక విద్యార్థులు వారి కుట్రలకు బలయ్యే ప్రమాదముందన్నారు.