శృతి..! సింగర్ శృతి..! ఫోక్ సింగర్ శృతి..! ఆమె పాడుతుంటే ఎంతో మధురంగా ఉంటుంది. ముఖ్యంగా ఆమె జానపదాలు పాడుతుంటే జనం తమను తామే మైమరచిపోతారు. ఆమె జీవితంలో పెద్ద సింగర్ కావాలని కలలు కన్నది. ఎక్కడ పాటలకు సంబంధించి ప్రోగ్రామ్‌లు జరిగినా అక్కడ వాలిపోయి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఇటీవల ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లై 20 రోజులైనా కాకముందే ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.
అయితే శృతి ఆత్మహత్యకు ప్రేమించినవాడే కారణమని తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన శృతికి చిన్నతనం నుంచి సింగర్ అవ్వాలని కోరిక. ఆ కోరికతోనే కష్టపడి ఫోక్ సింగర్‌గా మారి మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఈ క్రమంలో ఆమెకు సిద్ధిపేట జిల్లా పీర్లపల్లి గ్రామానికి చెందిన దయాకర్ అనే యువకుడు సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యాడు. ఇద్దరి పరిచయం ప్రేమగా మారి పెళ్ళికి దారితీసింది.
20 రోజుల క్రితమే ఈ జంట రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత శృతిని దయాకర్ ఇంటికి తీసుకెళ్లి అమ్మానాన్నలకు పరిచయం చేశాడు. ఎంతో సంబురంగా అత్తింట్లో అడుగుపెట్టిన శృతికి వేధింపులు మొదలయ్యాయి. కట్నం తీసుకురావాలని అత్తమామలు వేధించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కూడా కట్నం కోసం వేధిస్తూ కాలయముడుగా మారాడు.
ఆ వేధింపులు తట్టుకోలేని శృతి.. ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కన్నకూతురు మరణ వార్త విన్న తల్లిదండ్రులు గుండెలు అవిసేలా ఏడుస్తున్నారు. తన కూతురును భర్త, అత్తమామలే చంపారని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంతో ఉన్నతమైన భవిష్యత్ ఉన్న శృతి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.