రెండు లక్షల రుణమాఫీ వ్యవహారం అధికార కాంగ్రెస్–బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య ఉద్రిక్తతకు దారితీసింది. ఈ వ్యవహారంపై సిద్దిపేటలో మిడ్‌నైట్ వరకు హైడ్రామా సాగింది. అసలేం జరిగిందన్న డీటేల్స్‌లోకి వెళ్తే..
రేవంత్ సర్కార్ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రెండు లక్షల రుణమాఫీ అయ్యింది. దీంతో బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ నేత పూజల హరికృష్ణ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించేందుకు ప్రయత్నించారు. వెంటనే అలర్టయిన కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడి వెళ్లారు.
ఇరు పార్టీ కార్యకర్తల మధ్య టెన్షన్ వాతావరణ నెలకొంది. ఫ్లెక్సీ తీయాలని బీఆర్‌ఎస్, రాజీనామా చేయాల ని కాంగ్రెస్ కార్యకర్తల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. అదే సమయంలో సిద్దిపేట బీఆర్‌ఎస్ పార్టీపై ఫ్లెక్సీలను చించివేశారు. దీనిపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు పార్టీల కార్యకర్తలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
కార్యకర్తలు వినలేదు.. సై అంటే సై అని ఘర్ణణకు దిగబోయారు. దాదాపు 10 గంటలకు మొదలైన హైడ్రామా.. అర్ధరాత్రి ఒంటి గంటల వరకు సాగింది. పరిస్థితి గమనించిన పోలీసులు ఇరువర్గాలను చెదర గొట్టారు. మరికొందర్ని పోలీసుస్టేషన్‌కు తరలించారు. అసలేం జరిగిందన్న దానిపై ఆరా తీస్తున్నారు.
ఈ వ్యవహారంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు రియాక్ట్ అయ్యారు. పార్టీ ఆఫీసుకు భరోసా లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులు చోద్యం చూశారని విమర్శించారు. ఈ ఘటనపై డీజీపీ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.