వెంటనే అరెస్ట్ చేయండి
జర్నలిస్టులపై దాడిని ఖండించిన ఎంపీ
బీజేపీ ఎంపీ రఘునందన్ రావు.. సినీ నటుడు మోహన్‌బాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జర్నలిస్టులపై దాడిని ఖండించారు. మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు పెట్టి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ వందల సినిమాల్లో నటించి. జాతీయ అవార్డులు పొందిన ఆయన ఎంపీగా పనిచేసిన వ్యక్తి జర్నలిస్టులపై వ్యవహరించిన తీరు దారుణమని, అయ్యప్ప మాలలో ఉన్నాడన్న విషయం కూడా గ్రహించకుండా ఇష్టమొచ్చినట్టు రిపోర్టర్‌పై దాడి చేయడం క్షమించరాని నేరమన్నారు. ఈ దాడిని ఒక వ్యక్తిపై, సంస్థపై జరిగిన దాడిగా చూడొద్దని, మొత్తం మీడియాపై జరిగిన దాడిగా చూడాలన్నారు. అలాగే మోహన్ బాబుపై వెంటనే హత్యాయత్నం కేసు పెట్టి.. అరెస్ట్ చేయాలని ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు.
హాట్‌టాపిక్‌గా మంచు ఫ్యామిలీ వివాదం..
తెలుగు రాష్ట్రాల్లో మంచు ఫ్యామిలీ వివాదం హాట్ టాపిక్ గా మారింది. మూడు రోజులుగా కొనసాగుతున్న ఈ వివాదం.. మంగళవారం రాత్రి తారా స్థాయికి చేరుకుంది. దుబాయ్ లో ఉన్న విష్ణు రంగంలోకి దిగడంతో.. మోహన్‌బాబు నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో గొడవను కవర్ చేయడానికి వెళ్లిన టీవీ రిపోర్టర్ పై మోహన్ బాబు దాడి చేశారు. దీనికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం మీడియాతో పాటు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మైక్ లాక్కోని రిపోర్టర్ తలపై మోహన్ బాబు దాడి చేయగా.. అతని కన్ను, చెవి మధ్యలో మూడు చోట్ల ఎముక విరిగినట్లు డాక్టర్లు తెలిపారు. కాగా ఈ ఘటనపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టు సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతూ.. మోహన్ బాబు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.