భారత మాజీ క్రికెటర్, బాలీవుడ్ నటుడు సలీల్ అంకోలా తల్లి మాయా అశోక్ అంకోలా పుణేలోని తన నివాసంలో విగతజీవురాలిగా కనిపించారు. ఆమె గొంతు కోసిన స్థితిలో కనిపించడంతో, హత్య జరిగి ఉండొచ్చన్న అనుమానాలు ఉన్నాయి.
మాయా అశోక్ అంకోలా వయసు 77 సంవత్సరాలు. పుణేలోని ఎంతో ఖరీదైన ప్రాంతం డెక్కన్ ఏరియాలోని ప్రభాత్ రోడ్ లో ఆమె నివసిస్తున్నారు. మాయా అంకోలా విగతజీవురాలిగా గొంతు కోసిన స్థితిలో కిందపడిపోయి ఉండడాన్ని పనిమనిషి గుర్తించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. మాజీ క్రికెటర్ తల్లి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.
కాగా, ఇంట్లోకి ఎవరూ చొరబడిన దాఖలాలు లేకపోవడం, పొరుగువారికి శబ్దాలు కూడా ఏమీ వినిపించకపోవడంతో ఇది హత్యా లేక ఆత్మహత్యా అనేది కచ్చితంగా నిర్ధారించలేకపోతున్నామని ఓ అధికారి వెల్లడించారు.
ఆధారాల కోసం పోలీసులు సీసీటీవీ ఫుటేజి పరిశీలిస్తున్నారు. ఇరుగుపొరుగు వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. కాగా, పదకొండేళ్ల క్రితం ఇదే ఇంట్లో సలీల్ అంకోలా మాజీ భార్య పరిణీత ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.