ఆదిలాబాద్, అమ్మన్యూస్ ప్రతినిధి: 75 ఏళ్ల చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా మహిళకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు. సముచిత స్థానం కల్పించలేదు. కానీ మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అడుగు ముందుకేసి ఆదివాసీ మహిళకు ఎంపీ టికెట్ కేటాయించింది. ఎంతో మంది ఆశావహులను, సీనియర్ నేతలను కాదని ఓ సామాన్య ఉపాధ్యాయురాలైన ఆత్రం సుగుణను ఎంపిక చేసింది. అందుకే ఈసారి ఓటర్లు సైతం ఆమె వైపే మొగ్గుచూపుతున్నారు. మహిళను గెలిపించి పార్లమెంట్‌కు పంపిస్తే అందరి కష్టసుఖాలు తెలిసిన మనిషిగా..ప్రజలగొంతుకగా తనవాణిని బలంగా వినిపిస్తారనే విశ్వాసంతో..నమ్మకంతో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆమెను అందలమెక్కించాలనే కృతనిశ్చయంతో, ధృడమైన సంకల్పంతో ఉమ్మడి జిల్లా ఓటర్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూద్దామని, గతంలో ఇద్దరు నేతల పనితీరును తెలిసిందేనని, ఈ దఫా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్టుగా ఓటర్ నాడిని బట్టి అర్థమవుతోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో నాలుగు స్థానాలను బీజేపీ కైవసం చేసుకుని బలమైన శక్తిగా ఎదిగింది. అప్పటివరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కేవలం రెండు స్థానాల్లో విజయం సాధించింది. కేవలం ఒకే ఒక్క స్థానంపై కాంగ్రెస్ జెండా ఎగరేసినప్పటికీ రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టి ఈ ప్రాంతంలో పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. గతంలో ఎన్నడూలేని విధంగా హస్తం పార్టీలోకి ముఖ్య నేతలతోపాటు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వలసలు కట్టడంతో పార్టీ మరింత బలోపేతంగా మారుతోంది. పార్లమెంట్ ఎన్నికల వేళ చేరికలు ఊపందుకోవడంతో ఇక ఆ పార్టీకి తిరుగు లేదని సంకేతం ప్రజల్లోకి వెళ్లిపోయింది. అన్నీ అంశాలను అనుకూలంగా మలుచుకుని కాంగ్రెస్ పార్టీ పక్కా వ్యూహాలతో ముందుకుసాగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి, ఇన్‌చార్జి మంత్రి సీతక్క ఈ ఆదిలాబాద్ ఎంపీ స్థానంపై ప్రత్యేక దృష్టిసారించారు. అందులో భాగంగానే ముఖ్యనేతలను పార్టీలోకి రప్పించడంలో సఫలీ కృతమయ్యారనే వాదన వినబడుతోంది.
అంతర్గత విభేదాలతో బీజేపీ కుదేలు..
ఆదిలాబాద్ పార్లమెంట్ టికెట్‌ను సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు కాకుండా బీఆర్ఎస్ నుంచి వచ్చిన గొడెం నగేష్‌కు కట్టబెట్టడంతోనే ఆ పార్టీలో అంతర్గత విభేదాలకు కారణమైంది. అప్పటివరకు సఖ్యతగా ఉన్న ఆ పార్టీలో ఎవరికివారే యమునా తీరే అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. అసెంబ్లీ ఎన్నికల్లో శ్రేణులు కనబర్చిన ఉత్సాహం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కన్పించకపోవడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ముఖ్యంగా గొడెం నగేష్‌కు ఏకపక్షంగా టికెట్ కేటాయించడం పట్ల సీనియర్లంతా సైలెంట్ మూడ్‌లోకి వెళ్లి ఎక్కడా ప్రచారంలో తారసపడకపోవడం పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురిచేసిందని చెప్పాలి.
ఇదిలా ఉండగా ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలో బీజేపీకి నలుగురు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మినహా నిర్మల్, ముథోల్, సిర్పూర్ కాగజ్‌నగర్ ఎమ్మెల్యేలెవరూ నగేష్‌కు మద్దతుగా పూర్తిస్థాయి ప్రచారంలో పాల్గొనలేదనే చర్చ సాగుతోంది. అదే ఇప్పుడు ఆయన గెలుపుపై తీవ్ర ప్రభావం చూపబోతోందనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలోనే ఆదిలాబాద్ సెగ్మెంట్ పరిధిలో మాత్రమే గొడెం నగేశ్ ప్రచారం కొనసాగింది. మిగతా మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రం ఎన్నికల సందడి ఎక్కడా కనిపించలేదని పార్టీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. ఇతర పార్టీలకంటే ముందుగానే బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించిన ప్పటికీ పూర్తిస్థాయిలో ప్రచారం చేపట్టకపోవడానికి పార్టీలో నెలకొన్న విభేదాలే కారణమని తెలుస్తోంది.ఈ క్రమంలో నేతలందరినీ సమన్వయం చేయడంలో కొత్తగా వచ్చిన నగేష్ విఫలం చెందారని, అదే ఇప్పడు ఆయన కొంపముంచే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
సుగుణకు కలిసొచ్చే అంశాలు ఇవే..
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణకు చాలా అంశాలు కలిసొస్తున్నాయి. ఈ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఎంపీ బరిలో నిలిచిన మొదటి మహిళ కావడం ఒకటైతే.ఆదివాసీ పేద కుటుంబానికి చెందిన వ్యక్తి కావడం,
అందరితో కలుపుగోలుగా మాట్లాడే మనస్థత్వం,ఆదివాసీ హక్కులకై పోరాటం చేసిన ఉద్యమనాయకురాలు, అధిష్టాన పెద్దల అండదండలు మెండుగా ఉండడం, మైనార్టీవర్గం మొత్తం వన్‌సైడ్ సపోర్టు చేయడం, మహిళ ఓటర్లు అధికంగా ఉండడం వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఆమె గెలుపు నల్లేరుపై నడకేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా కుల సంఘాలు, సామాజిక కార్యకర్తలు, మేథావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అన్నివర్గాల ప్రజలు ఒక్కసారి అవకాశం ఇవ్వాలనే భావిస్తున్నట్టుగా ఓటరు నాడిని బట్టి అర్థమవుతోంది. ఎక్కడా చూసినా కాంగ్రెస్ విజయం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. ఆదివాసీల తర్వాత అత్యధిక ఓటింగ్ శాతం కలిగిన లంబాడాలు సైతం ఆదివాసీ మహిళా అభ్యర్థిగా రంగంలోకి దిగిన ఆత్రం సుగుణకే మద్దతు తెలపాలని మెజార్టీ ఓటర్లు యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.
గడ్డు పరిస్థితుల్లో బీఆర్ఎస్..
రాష్ట్రంలో పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మారడంతో జిల్లాలో ఆ పార్టీ పరిస్థితి ఇబ్బందికరంగా, అగమ్యగోచరంగా తయారైంది. అసెంబ్లీ ఎన్నికల్లో బోథ్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్‌లో ఉన్న ప్రజాప్రతినిధులు, కేడర్ మొత్తం కాంగ్రెస్, బీజేపీలోకి వలస కట్టారు. నిర్మల్‌లో మంత్రిగా పనిచేసిన ఇంద్రకరణ్‌రెడ్డి సైతం కాంగ్రెస్‌లోకి రావడంతో సీన్ మొత్తం మారిపోయింది. మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, కోనేరు కోనప్ప, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, విజయడెయిరీ మాజీ చైర్మెన్ లోక భూమారెడ్డి వంటి సీనియర్లంతా పార్టీ మారడంతో బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఆ పార్టీ తరపున పార్లమెంట్ బరిలో ఆత్రం సక్కును నిలిపినప్పటికీ పెద్దగా ప్రచారం చేయకపోవడం, కేవలం ఆదిలాబాద్ సెగ్మెంట్‌కే పరిమితం కావడం, బలమైన క్యాడరంతా ఇతర పార్టీల్లోకి జంప్ కావడంతో ఆ పార్టీలో జోష్ లేకుండా పోయింది. కేవలం బీఆర్ఎస్ తన ఉనికి కాపాడుకునేందుకే శ్రమించాల్సి వస్తోంది. ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతే పూర్తి స్థాయిలో తుడిచిపెట్టుకుపోవడం ఖాయమనే చర్చ ప్రస్తుతం ఊపందుకుంది. మొత్తానికైతే మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులలో ఆత్రం సుగుణకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని, బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇవాళ్టితో ప్రచారానికి అయితే తెరపడింది. మరీ ఓటర్లు ఎవరికీ పట్టం కడతారో..ఎవరిని అందలమెక్కిస్తారో తెలియాలంటే జూన్ 6వ తేదీ వరకు వేచి చూడక తప్పదు.