ఈ–స్కూటర్ తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ గురించి వచ్చిన ఫిర్యాదులపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కంపెనీ అందించే సేవల్లో లోపాలు ఉన్నాయంటూ వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందడంతో, వాటి పరిష్కారానికి సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(సీసీపీఏ) ఓలాకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనిపై 15 రోజుల్లోగా ప్రతిస్పందించాలని స్పష్టం చేసింది.
కన్జ్యూమర్ అఫైర్స్ విభాగం ఆధ్వర్యంలో పనిచేసే కన్జ్యూమర్ హెల్ప్‌లైన్‌కు 2023, సెప్టెంబర్ నుంచి 2024, ఆగష్టు 30 మధ్య ఓలా స్కూటర్లపై 10,644 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో 3,389 సర్వీస్ విషయంలో జాప్యం జరుగుతున్నాయని, 1,899 డెలివరీ అందించడంలో ఆలస్యమవడంపై వచ్చాయి. మరో 1,459 ఫిర్యాదులు ఇచ్చిన హామీ ప్రకారం సర్వీస్ ప్రయోజనాలు అందించలేదని ఉన్నాయి. అంతేకాకుండా తయారీ లోపాలు, సెకండ్ హ్యాండ్ అమ్మకాలు, క్యాన్సిల్ చేసిన వాటి రీఫండ్లు, సర్వీసింగ్ తర్వాత పునరావృతమయ్యే సమస్యలు, ఓవర్ ఛార్జింగ్, బిల్లుల్లో తప్పులు, బ్యాటరీ, పరికరాల సమస్యలను సీసీపీఏ తన నోటీసుల్లో ప్రస్తావించింది. నోటీసుపై కంపెనీ అధికారికంగా స్పందించలేదు.