కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ మొదటి వారంలో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయని అన్నారు. గురువారం విజయ సంకల్ప యాత్ర రోడ్ షో భాగంగా వారసి గూడాలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ దేశంలో అవినీతి రహిత ,శాంతి భద్రతలు బడుగు బలహీనులకు సంక్షేమ పాలనకు అందించే విధంగా తొమ్మిదిన్నర ఏళ్ళుగా మోడీ ప్రభుత్వం పాలనను కొనసాగిస్తుందన్నారు.ఈ దేశం కోసం, పిల్లల భవిష్యత్, పేదల ప్రజల సంక్షేమం కోసం ఓటు వేసే విధంగా ప్రజలను చైతన్యం చేయడానికి విజయ సంకల్ప యాత్ర జరుగుతుందని చెప్పారు.
ఫిబ్రవరి 20వ తేదీ నుంచి ఈ యాత్రలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అంబర్ పేట చౌరస్తాలో జరిగే సభతో మన యాత్ర పూర్తి అవుతుందని స్పష్టం చేశారు. నాడు హైదరాబాద్‌తో పాటు దేశంలోని ముంబై వంటి నగరాలలో పాకిస్థాన్ ఐఎస్ఎస్ ఉగ్రవాదుల దాడులను చూశామని గుర్తు చేశారు. మోడీ వచ్చిన తర్వాత దేశం ప్రశాంతంగా మారిందని, భారత్‌ను ప్రపంచదేశాలు పొగిడే విధంగా చేశారని కొనియాడారు. దేశంలో బెస్ట్ లీడర్‌గా మోడీ వెలుగుతున్నారని, అన్ని సర్వేలలో మోడీ టాప్‌లో నిలుస్తున్నారన్నారు. ఈ ఎన్నికల్లో మోడీని మరోసారి ఆశీర్వదిద్దాం అని కిషన్ రెడ్డి కోరారు.