లోక్ సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధమైంది. కేసీఆర్ త్వరలోనే ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ విస్తృత ప్రచారం నిర్వహిస్తారని భావిస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన పూర్తి చేసింది బీఆర్ఎస్. 17 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తోంది. హైదరాబాద్ అభ్యర్థి ప్రకటనతో బీఆర్ఎస్ లో అభ్యర్థుల ఎంపిక పూర్తైంది. హైదరాబాద్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను బరిలో దింపుతోంది బీఆర్ఎస్. ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. అభ్యర్థులకు మద్దతుగా రాష్ట్రమంతా ప్రచారం చేసి బీఆర్ఎస్ కార్యకర్తల్లో కొత్త జోష్ నింపబోతున్నారు కేసీఆర్.
ఎన్నికల వ్యూహంలో భాగంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వేగంగా పూర్తి చేశారు కేసీఆర్. ఇక ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత, కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ పేర్లతో తొలి జాబితా ప్రకటించిన బీఆర్ఎస్.. తర్వాత విడతల వారీగా అభ్యర్థులను ప్రకటించింది. 17 స్థానాల్లో ఓసీ వర్గాలకు 6, ఎస్టీ వర్గానికి 2, ఎస్సీ వర్గానికి 3, బీసీ వర్గాలకు 6 టికెట్లను కేటాయించింది.
చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్, నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్, వరంగల్ నుంచి కడియం కావ్య, మెదక్ నుంచి పి.వెంకటరామి రెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ తరుపున అదృష్టం పరీక్షించబోతున్నారు.