కేటీఆర్‌కు బిగుస్తున్న ఉచ్చు
ఈడీ జోక్యంతో రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు
ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఈడీ కూడా జోక్యం చేసుకోవడంతో రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే కేసు నమోదు చేసిన ఏసీబీ రంగంలోకి దిగింది. శుక్రవారం ఉదయం విచారణ మొదలుపెట్టింది. అప్పట్లో జరిగిన ఒప్పంద పత్రాల ఫైళ్లను పరిశీలించారు. ఈ క్రమంలో ఐఏఎస్‌ల నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. మరోవైపు ఈడీ సైతం ఫోకస్ చేసింది. విదేశాలకు నిధులు చెల్లించడంతో కేటీఆర్ పై కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతోంది. పీఎంఎల్‌ఏ చట్టం కింద కేసు నమోదు చేయనుంది. అయితే ఈ కేసు సంబంధించి పూర్తి వివరాలు పంపాలని ఏసీబీకి లేఖ రాయడం గమనార్హం.
ఎఫ్‌ఐఆర్ కాపీతోపాటు హెచ్‌ఎండీఏ అకౌంట్ నుంచి ఎంత మొత్తంలో నిధులు బదిలీ చేశారో ఆ వివరాలు కోరింది ఈడీ. ఐఏఎస్ దాన కిశోర్ ఫిర్యాదు కాపీ కూడా పంపాలని అందులో ప్రస్తావించింది. ట్రాన్సాక్షన్లు జరిగిన తేదీల వివరాల డీటేల్స్ కోరింది ఈడీ.
ఎలాంటి అనుమతి లేకుండానే..
ఎలాంటి అనుమతి లేకుండా విదేశీ కంపెనీకి రూ. 55 కోట్లు రెండు విడతలుగా బ్యాంక్ నుంచి ట్రాన్స్‌ఫర్ చేశారు. ఎలాంటి అగ్రిమెంట్ లేకుండా ఎందుకు చెల్లింపులు జరిపారన్నది మొదటి పాయింట్. ఫైల్స్‌పై ఎవరెవరు సంతకాలు చేశారు? నిధులు ఏయే కంపెనీలకు వెళ్లాయి? అనేదానిపై ఏసీబీ దృష్టి పెట్టింది. ఇప్పటికే కొంత సమాచారం ఏసీబీ దగ్గరుంది. అయితే మనీ లావాదేవీలకు సంబంధించిన డిటేల్స్ సేకరించగానే కేటీఆర్‌ను అదుపులోకి తీసుకోవడం ఖాయమని అంటున్నారు. కేటీఆర్ ఆదేశాల మేరకే నిధులు ట్రాన్స్‌ఫర్ చేశామన్నది అధికారుల మాట.
కేటీఆర్ విషయానికి వస్తే..
ఇక బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విషయానికి వస్తే ఫార్ములా ఈ కారు రేసులో రూ. 55 కోట్లు.. ప్రభుత్వం, సీఎస్ అనుమతి లేకుండా.. ఆ శాఖకు సంబంధించిన సెక్రటరీ, ప్రిన్స్‌పల్ సెక్రటరీ స్థాయి అధికారులతో రూ. 55 కోట్ల బదలాయింపు చేసినట్లు కేటీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీనిపై ఏసీబీ కేసు ఇప్పటికే ఫైల్ అయింది. కొత్తగా అందులో ఈడీ జోక్యం చేసుకోవడంతో ఈ కేసు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.
కేటీఆర్ ఏ1:
కాగా ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఏసీబీ కేసు పెట్టింది. ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను ఏ1గా పేర్కొంది. అప్పటి పురపాలక శాఖ కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను ఏ2గా, నాటి హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డిని ఏ3గా పేర్కొంది. కేటీఆర్ తదితరులపై అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(1),(ఏ) రెడ్ విత్ 13(2) సెక్షన్ 409, 120 బి ప్రకారం కేసు నమోదు చేశారు. మరి కొంతమంది అధికారులను సైతం ఎఫ్‌ఐఆర్‌లో చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం కేటీఆర్‌కు నోటీసు ఇచ్చి.. ఆ తర్వాత లేదా అదే రోజు అరెస్టు చేసే దిశగా ఏసీబీ అడుగులు వేస్తున్నట్లు సమాచారం.